ప్రాణం పోసే విషం.. లీటర్‌కు రూ.84 కోట్లు

5 Dec, 2022 01:51 IST|Sakshi

సాధారణంగా విషం అంటే ప్రాణాలు తీసేది. పాములు, తేళ్లు, సాలీళ్లు ఇలా ఎన్నో రకాల జీవుల్లో విషం ఉంటుంది. కానీ అదే విషం కొన్నిసార్లు ప్రాణాలు కాపాడే ఔషధం కూడా. అలాంటిదే ‘డెత్‌స్టాకర్‌’ తేలు విషం. అత్యంత ప్రమాదకరమైన ఈ విషం ద్రవ పదార్థాల్లో ప్రపంచంలోనే అత్యంత విలువైనది కూడా. మరి దీని విశేషాలేమిటో తెలుసుకుందామా.. 
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

‘ విషం నుంచే ఔషధం 
తేలు కుట్టిందంటే మంటతో విలవిల్లాడిపోతాం. కుట్టిన తేలును బట్టి కొన్నిసార్లు అస్వస్థత పాలవడం, మరికొన్నిసార్లు అయితే ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది. దీనికి కారణం తేలు కొండిలోని విషం. అందులోని న్యూరో ట్యాక్సిన్లు. అంటే మన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే రసాయన పదార్థాలు. ఈ న్యూరో ట్యాక్సిన్లలో కొన్నిరకాలను అసాధారణ వైద్య చికిత్సల్లో వినియోగిస్తుంటారు. అందుకే వాటికి డిమాండ్‌ ఎక్కువ. 

‘ మెదడు కేన్సర్‌ చికిత్సలో.. 
భూమ్మీద ఉన్న తేళ్లన్నింటిలోనూ ‘డెత్‌స్టాకర్‌’ తేళ్లు అత్యంత విషపూరితమైనవి. ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఈ తేళ్లు రెండు నుంచి ఆరేళ్ల పాటు బతుకుతాయి. పది సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వీటి విషంలో ‘క్లోరోట్యాక్సిన్‌’గా పిలిచే అత్యంత అరుదైన రసాయన పదార్థంతోపాటు మరికొన్ని ముఖ్యమైన న్యూరోట్యాక్సిన్లు ఉంటాయి.

ఈ క్లోరోట్యాక్సిన్‌ మెదడులోని కేన్సర్‌ కణితులు మరింతగా విస్తరించకుండా అడ్డుకుంటుంది. అంతేగాకుండా మెదడులో కేన్సర్‌ సోకిన కణాలకు మాత్రమే అతుక్కుపోతుంది. దీనివల్ల వైద్యులు సర్జరీ చేసి కేన్సర్‌ సోకిన భాగాన్ని/కణాలను పూర్తిగా తొలగించేందుకు వీలవుతుంది. సాధారణంగా సర్జరీ తర్వాత కేన్సర్‌ కణాలు ఏమైనా మిగిలి ఉంటే.. వాటి వల్ల మళ్లీ కేన్సర్‌ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. క్లోరోట్యాక్సిన్‌ను మార్కర్‌గా వాడటం వల్ల ఈ సమస్య తప్పుతుంది. 

‘ అత్యంత విలువైన విషం! 
‘డెత్‌స్టాకర్‌’ తేలు విషం ధర ఒక లీటర్‌కు సుమారు రూ.84 కోట్లు (కోటి డాలర్లకుపైనే..). ఎందుకంత ధర అంటే.. ఈ విషంలో అత్యంత అరుదైన న్యూరోట్యాక్సిన్‌ ఉండటం, సేకరణ అత్యంత కష్టమైన పని అవడం, డిమాండ్‌ ఎక్కువగా ఉండటమే. ఒక తేలు నుంచి ఒకసారి కేవలం 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే వస్తుంది. అంటే ఒక లీటర్‌ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఈ రకం తేళ్లను పెంచుతూ.. వాటి నుంచి విషాన్ని సేకరించి విక్రయిస్తుంటారు. 

‘ప్రత్యేకంగా పరికరాన్ని రూపొందించి.. 
మామూలుగా తేళ్ల నుంచి విషం సేకరించడం కోసం.. మొదట వాటికి స్పల్ప స్థాయిలో కరెంట్‌ షాక్‌ ఇచ్చి, వాటి విష గ్రంధులను పరికరాలతో నొక్కుతారు. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తేళ్లు గాయపడటం, విష గ్రంధులు పగిలిపోవడం వంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో మొరాకో శాస్త్రవేత్తలు తేళ్ల విషం సేకరణకోసం ఓ ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. తేళ్లను మెల్లగా పట్టుకుని, వాటి కొండిలను పరికరంలో పెడతారు. కొండిలోని విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా వాటంతట అవే విషాన్ని విడుదల చేస్తాయి. అవి గాయపడటం ఉండదు, ఎక్కువ విషం సేకరించవచ్చు. 

‘ పాముల విషం నుంచి కూడా.. 
పాములు, తేళ్ల విషంలో ఉండే న్యూరోట్యాక్సిన్లు, ఇతర రసాయన పదార్థాలు మన శరీరంలోని నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి. ఒక్కో రకం జీవిలో భిన్నమైన రసాయన పదార్థాలు ఉంటాయి. వాటితో భిన్నమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పాములు, తేళ్లు, ఇతర జీవుల విషం నుంచి సరికొత్త ఔషధాల అభివృద్ధికి పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ రకాల కేన్సర్లు, అధిక రక్తపోటు, గుండెపోటు, అల్జీమర్స్, పార్కిన్‌సన్స్, సుదీర్ఘకాలం బాధించే నొప్పులు వంటి సమస్యలకు పరిష్కారాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.  

మరిన్ని వార్తలు