రోడ్డు పక్కన డబ్బుల సంచి‌.. అప్పగించిన కుర్రాడు, కట్‌ చేస్తే..

13 Apr, 2022 17:51 IST|Sakshi

మనది కాని సొమ్ముపై మందికి ఆశ ఎక్కువ!. అయితే పేదరికంలో ఉన్నా ఆ యువకుడు నిజాయితీగా వ్యవహరించాడు. రోడ్డు పక్కన దొరికిన డబ్బుల బ్యాగ్‌ను.. ఎవరిదో వాళ్లకు అప్పగించేదాకా ఊరుకోలేదు. ఇందుకుగానూ అతను అందుకున్న ప్రతిఫలం.. బహుశా ప్రపంచంలో ఎవరూ అందుకోనంత విలువైనదేమో!

ఆఫ్రికా దేశం లైబీరియాలో ఇమ్మాన్యుయెల్‌ టులోయి అనే 19 ఏళ్ల కుర్రాడు జీవిస్తున్నాడు. పేదరికం, తండ్రి చావు కారణాలతో.. తొమ్మిదేళ్ల వయసులో చదువు ఆపేశాడటను. డొక్కు మోటర్‌ సైకిల్‌ను ట్యాక్సీ సర్వీస్‌గా ఉపయోగించుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. వచ్చేది కొద్ది మొత్తమే కావడంతో పూట గడవడం అతనికి కష్టంగానే ఉంటుంది మరి. 

ఇలాంటి టైంలో.. ఓరోజు రోడ్డు పక్కన ప్లాస్టిక్‌ బ్యాగులో లైబెరియన్‌, అమెరికా కరెన్సీ నిండిన ఓ సంచి ఇమ్మాన్యుయెల్‌ కంట పడింది. దానిని అలాగే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి.. ఆపై వాళ్లు ఓనర్‌కు అప్పగించేదాకా అక్కడే ఉండిపోయాడు. అతని నిజాయితీకి మెచ్చి డబ్బులు ఇవ్వబోతుంటే.. తినడానికి సరుకులు ఇవ్వమంటూ కోరాడు ఆ కుర్రాడు. దీంతో 1500 డాలర్ల విలువైన సరుకులను అతని కుటుంబానికి అప్పగించాడు ఆ డబ్బు ఓనర్‌. 

ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. నెటిజన్స్‌తో పాటు దేశ అధ్యక్షుడు జార్జ్‌ వీ గేవ్‌ కూడా ఫిదా అయిపోయాడు. ప్రభుత్వం తరపునే కాదు.. స్థానిక మీడియా ఒకటి అతనికి ఆర్థిక సాయం అందించింది. ఆ డబ్బుతో ఏం చేశాడో తెలుసా?..

లైబీరియాలో ప్రతిష్టాత్మకమైన రిక్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్కూల్‌లో చేరాడు. అది సెకండరీ ఎడ్యుకేషన్‌ కోసం. చదువు అతనికి ఇష్టం. అందుకే.. పిల్లల మధ్య మొహమాటం లేకుండా కూర్చుంటున్నాడు.  మరో ఆరేళ్లు చదివితేనే అతని గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేది. కిందటి ఏడాది ఈ ఘటన జరగ్గా.. అతను స్కూల్‌లో చేరి చదువుకుంటున్న ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు