చైనాలో ఆహార సంక్షోభం.. కట్టడి దిశగా ప్రయత్నాలు

1 Sep, 2020 16:41 IST|Sakshi

‘క్లీన్‌ యువర్‌ ప్లేట్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన చైనా

బీజింగ్‌: కరోనా వైరస్ కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చైనా.. ఆహార సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వెల్లడించారు. ఈ క్రమంలో 2013 నాటి ‘క్లీన్ యువర్ ప్లేట్’ కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించారు. ప్రజలు ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అయితే ఈ కార్యక్రమానికి, లద్దాఖ్‌, దక్షిణ సముద్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధం ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ చర్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే డ్రాగన్‌ సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వేలా ప్రవర్తిస్తూ.. ఉద్రిక్తతలను పెంచుంతుందంటున్నారు విశ్లేషకులు. గతంలో మావో జెడాంగ్‌ కూడా ఇలానే చేశారని గుర్తు చేసుకుంటున్నారు. 1962లో ఆహార వృథాని అరికట్టడానికి మావో ‘గ్రేట్‌ లీఫ్‌ పార్వర్డ్‌ మూమెంట్’‌ని ప్రారంభించాడు. ఫలితంగా కోట్ల మంది చైనీయులు ఆకలితో చనిపోయారు. అయితే ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే కాక.. ప్రపంచ దేశాలతో పాటు స్వంత ప్రజల దృష్టిని మరల్చడానికి 1962లో భారత్‌తో సరిహద్దు వివాదాన్ని ముందుకు తెచ్చాడని.. ప్రస్తుతం జిన్‌పింగ్‌ కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

‘ఆహార వృథా విపరీతంగా ఉంది. ఈ గణాంకాలు విస్మయానికి గురిచేసేలా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి’ అని అధికారులకు జిన్‌పింగ్ సూచించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఆహార వృథాను సిగ్గుచేటుగా ప్రజలు భావించేలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం. జిన్‌పింగ్ ప్రకటన విడుదలైన వెంటనే.. ఆహారాన్ని ఎవరూ వృథా చేయకూడదంటూ అన్ని మీడియాల్లోనూ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. 2015లో చైనాలోని మహా నగరాల్లో 17 నుంచి 18 టన్నుల ఆహారాన్ని వృథా చేసినట్లు గణాంకాలను మీడియాలో చూపిస్తున్నారు. ఈ మొత్తం దక్షిణ కొరియా పరిమాణంలో ఉన్న దేశానికి ఆహారంగా ఇవ్వడానికి ఇది సరిపోతుందని ప్రభుత్వ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంచనా వేసింది. మీడియాలో ఆహార వృథా, బాధ్యతారాహిత్య ప్రవర్తనల ప్రచారం నడుమ ఆహార సంక్షోభాన్ని ప్రభుత్వం దాచి పెడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలో ఈ సారి ఆహార సంక్షోభం వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే గోధుమల సేకరణ 20శాతం తగ్గినట్లు తెలుస్తోంది. 

అయితే, కరువు అంశాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కొట్టిపారేసింది. 120 కోట్ల కిలోల ధాన్యం అదనంగా పండించామని పేర్కొంది. కానీ దక్షిణ చైనాలో ఈ ఏడాది భారీగా వరదలు ముంచెత్తడంతో కొంత నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి వచ్చే ఆహార దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. చైనా ఆహార అవసరాలను 30శాతం వరకు దిగుమతులే తీరుస్తాయి. మరోవైపు భారత్‌, వియత్నాంలు కరోనావైరస్‌ కారణంగా వరి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. మరోవైపు ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కారణంగా చైనాలో 100 మిలియన్ల పందులను చంపారు. దేశంలో మెజారిటీ జనాభాకు పందులే ప్రధాన ఆహార వనరు. ప్రస్తుతం అవి తక్కువగా లభ్యమవుతుండటంతో పంది మాంసం ధర 85 శాతం పెరిగినట్లు సమాచారం. (చదవండి: నెంబర్‌ వన్‌ సాధించడమే లక్ష్యం: బాదల్)

అలానే చైనాకు అవసరమైన బియ్యంలో అధిక భాగం యాంగ్జీ నది పరివాహక ప్రాంతం నుంచే వస్తాయి. అయితే ఈ ఏడాది సంభవించిన భారీ వరదల కారణంగా వరి ఉత్పత్తిలో భారీ తగ్గుదల కనిపించింది. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ గణాంకాల ప్రకారం, చైనా ధాన్యం దిగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే జనవరి మరియు జూలై మధ్య కాలంలో 22.7 శాతం (74.51 మిలియన్ టన్నులకు) పెరిగాయి. 910,000 టన్నుల దిగుమతితో గోధుమ దిగుమతులు సంవత్సరానికి 197 శాతం పెరిగాయి. ఈ నెలలో మొక్కజొన్న దిగుమతులు కూడా 23 శాతం పెరిగి 880,000 టన్నులకు చేరుకున్నాయి.

మరిన్ని వార్తలు