వీడియో: ఇదెక్కడి బంధం: కన్నపేగు కసిరి కొట్టినా.. ఆ అమ్మ అక్కున చేర్చుకుంది

16 May, 2022 21:30 IST|Sakshi

ప్రేమకు హద్దులు లేవు. అందునా అమ్మ ప్రేమకి!. అందుకు నిదర్శనంగా నిలిచే.. ఘటనలు ఎన్నో చూస్తున్నాం.. వింటున్నాం కూడా. ప్రస్తుతం ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో  వైరల్‌ అవుతున్న ఓ వీడియో అమితంగా ఆకట్టుకుంటోంది. 

అమ్మ ప్రేమకు దూరమైన మూడు పులి పిల్లలను అక్కున చేర్చుకుంది ఓ లాబ్రాడర్‌ డాగ్‌. అలాగని ఆ అమ్మ వాటికేం శాశ్వతంగా దూరం కాలేదు. ఓ తల్లి పులి దానికి పుట్టిన మూడు పిల్లలను పుట్టినప్పటి నుంచి దగ్గరకు రానివ్వడం లేదు. 
 
దీంతో జూ నిర్వాహకులు.. ఆ పులి కూనల ఆలనా పాలనను ఓ శునకానికి అప్పజెప్పారు. తొలుత ఈ ప్రయత్నం ఫలించదేమో అని, పులి కూనల పరిస్థితిపై ఆందోళన చెందారు నిర్వాహకులు. కానీ, అదేం బంధమో.. ఆ పులి కూనలను అక్కున చేర్చుకుంది ఆ ఆడ శునకం. ఇంకేం ఆ ప్రేమకు సోషల్‌ మీడియా ఫిదా అవుతోంది. చైనా జూలో ఇది చోటుచేసుకుంది. ఒరిజినల్‌ వీడియో ఏప్రిల్‌ 27న అప్‌లోడ్‌ కాగా, తాజా వీడియో ట్విటర్‌ ద్వారా వైరల్‌ అవుతోంది.

నేషనల్‌ టైగర్‌ కన్వర్జేషన్‌ అథారిటీ ప్రకారం.. సాధారణంగా తల్లి పులి చనిపోయినప్పుడు కూనలు అనాథలు అవుతుంటాయి. కానీ, పాలిచ్చే పెంచే ఓపిక లేనప్పుడు కూడా పులులు ఇలా కూనల్ని దగ్గరకు రానివ్వకుండా కసరుకుంటాయట. అడవుల్లో అయితే కొన్ని సందర్భాల్లో తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తుంటాయట!. 

కిందటి ఏడాది.. ఓ నల్ల చిరుతను ఓ శునకం సైబీరీయాలో పెంచిన కథనం.. ఇలాగే వైరల్‌ అయ్యిం అందరినీ ఆకట్టుకుంది. 

మరిన్ని వార్తలు