లిజ్‌ ట్రస్‌కే 90 శాతం విజయావకాశాలు

31 Jul, 2022 05:09 IST|Sakshi

రిషికి 10 శాతమే చాన్సు: స్మార్కెట్స్‌

లండన్‌:  బ్రిటిష్‌ ప్రధానమంత్రి పీఠం కోసం కన్జర్వేటివ్‌ పార్టీ నేతలు రిషి సునాక్, లిజ్‌ ట్రస్‌ మధ్య పోరు కొనసాగుతోంది. ఇరువురు తమ పార్టీ సభ్యుల మద్దతు పొందడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే లిజ్‌ ట్రస్‌కే పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. సర్వేల్లో ఆమె ముందంజలో ఉన్నట్లు తేలింది. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానంటూ ట్రస్‌ ఇస్తున్న హామీ వైపు అందరూ ఆకర్శితులవుతున్నట్లు తెలుస్తోంది.

కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, తద్వారా నూతన ప్రధానమంత్రిగా లిజ్‌ ట్రస్‌ ఎన్నికయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతం ఉన్నాయని ప్రఖ్యాత బెట్టింగ్‌ ఎక్స్‌ఛేంజ్‌ సంస్థ ‘స్మార్కెట్స్‌’ తాజాగ ప్రకటించింది. రిషి సునాక్‌కు కేవలం 10 శాతం అవకాశాలే ఉన్నాయని స్పష్టం చేసింది. ట్రస్‌కు తొలుత 60 శాతం విజయావకాశాలు ఉండగా, అది ఇప్పుడు 90 శాతానికి చేరడం ఆసక్తికరంగా మారింది.

ఇక రిషి విజయావకాశాలు 40 శాతం నుంచి 10 శాతానికి పడిపోయాయి. పరిస్థితులు మొత్తం ట్రస్‌కు క్రమంగా సానుకూలంగా మారుతున్నాయని స్మార్కెట్స్‌ పొలిటికల్‌ మార్కెట్స్‌ అధినేత మాథ్యూ షాడిక్‌ చెప్పారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ టీవీ చర్చా కార్యక్రమాల్లో రిషి కంటే లిజ్‌ ట్రస్‌ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. తాను వెనుకంజలో ఉన్నా చివరి దాకా పోరాడుతానని, ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తానని రిషి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు