వీడియో: చైనా టాప్‌ ట్రెండింగ్‌లో బప్పీలహరి సాంగ్‌ .. ఫ్రస్ట్రేషన్‌లోనే తెగ వైరల్‌ చేస్తున్నారు

1 Nov, 2022 15:21 IST|Sakshi

బీజింగ్‌: కరోనా కట్టడి పేరుతో కఠిన ఆంక్షలు.. తీరా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే టైంకి కొత్త వేరియెంట్ కేసులు.. ఆపై మళ్లీ ఆంక్షల విధింపు.. చైనాలో గత రెండేళ్లుగా ఇదే రిపీట్‌ అవుతోంది. అక్కడి పౌరులు కఠిన లాక్‌డౌన్‌ ప్రభావంతో మానసికంగా కుంగిపోతున్నారు. చివరికి ఆ నిబంధనల దెబ్బకు ప్రాణాలు తీసుకునేంత స్థాయికి పరిస్థితి చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు.

అయితే..  ఇప్పుడా ఫ్రస్ట్రేషన్‌ మరో స్థాయికి చేరుకుంది. మళ్లీ బీజింగ్‌ సహా ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో జనాలు పిచ్చెక్కి పోతున్నారు. లాక్‌డౌన్‌ నుంచి తప్పించుకునేందుకు ఊళ్లు విడిచి పారిపోతున్నారు కొందరు. అయితే మరోవైపు కఠిన లాక్‌డౌన్‌లకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఉద్యమిస్తూ.. తమ కోపాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మన పాట అక్కడ హవా చూపిస్తోంది. అందుకు ఒక చిత్రమైన కారణం కూడా ఉంది.

1982లో మిథున్‌ చక్రవర్తి హీరోగా వచ్చిన బాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ ‘డిస్కో డ్యాన్సర్‌’. దానికి బప్పీలహరి మ్యూజిక్‌. అందులో పార్వతి ఖాన్‌ ఆలపించిన ‘జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా’ ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీ సోషల్‌ మీడియాను విపరీతంగా కుదిపేస్తోంది. అక్కడి షార్ట్‌ వీడియో మేకింగ్‌ యాప్‌లలో ఇప్పుడు ఈ పాటదే హవా. ముఖ్యంగా చైనీస్‌ వెర్షన్‌ టిక్‌టాక్‌ ‘డౌయిన్‌’ను ఈ పాట ఊపేస్తోంది.

 
మాండరిన్‌ భాషలో ‘జియ్‌ మీ, జియ్‌ మీ’ అంటే అర్థం ‘బియ్యం ఇవ్వమ’ని(గివ్‌ మీ రైస్‌). లాక్‌డౌన్‌ దెబ్బకు లక్షల మంది అర్థాకలితో అలమటిస్తున్నారని, వాళ్ల కోసం కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని కోరుతూ ఇలా సెటైరిక్‌గా ఈ జియ్‌ మీ జియ్‌ మీ (జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా) సాంగ్‌పై చిన్నాపెద్దా అంతా షార్ట్‌ వీడియోస్‌ తీసి వదులుతున్నారు. వాళ్ల నిరసనకు అదొక థీమ్‌గా మారిపోయింది. దీంతో ఆ వీడియోలు ట్విట్టర్‌ ద్వారా వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా అక్కడ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి కంటెంట్‌ అయినా సరే.. వెంటనే సెన్సార్‌ కిందకు వెళ్లి సోషల్‌ మీడియా నుంచి మాయమైపోతుంటుంది. అయితే.. ఈ పాట మాత్రం ఎందుకనో ఇప్పటిదాకా ఇంకా సెన్సార్‌షిప్‌కు గురి కాలేదు మరి. 

ఇక భారతీయ చిత్రాలకు చైనా గడ్డపై లభించే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 50, 60వ దశకాల్లో బాలీవుడ్‌ చిత్రాలకు అక్కడ విపరీతమైన ఆదరణ దక్కింది. ఆపై అమీర్‌ ఖాన్‌ త్రీ ఇడియట్స్‌, దంగల్‌ తో పాటు హిందీ మీడియం, అంధాధూన్ చిత్రాలు విపరీతమైన క్రేజ్‌ దక్కించుకున్నాయి.

మరిన్ని వార్తలు