విదేశీ సంబంధాలపై బైడెన్‌ దృష్టి

24 Jan, 2021 04:40 IST|Sakshi

కెనడా ప్రధానికి తొలి ఫోన్‌ కాల్‌  

వాషింగ్టన్‌:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించారు. విదేశీ నేతల్లో తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు ఫోన్‌ చేసి మాట్లాడారు. కరోనాపై కలసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పులపై కలసికట్టుగా పోరాటం చేయాల్సి ఉందని బైడెన్‌ చెప్పారు. కెనడా ప్రధానితో పాటు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రాడర్‌తో బైడెన్‌ మాట్లాడారు. ఈ వారంలో మరికొంత మంది విదేశీ నాయకులతో బైడెన్‌ మాట్లాడతారని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.  

రక్షణ మంత్రిగా నల్లజాతీయుడు అస్టిన్‌
అమెరికా రక్షణ మంత్రిగా రిటైర్డ్‌ జనరల్‌ అస్టిన్‌ నియమితులయ్యారు. అగ్రరాజ్యానికి నల్లజాతీయుడు ఒకరు రక్షణ మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి. అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్‌ రక్షణ మంత్రిగా అస్టిన్‌ నామినేషన్‌ను రికార్డు స్థాయిలో 93–2 ఓట్ల తేడాతో బలపరిచింది. ఆ వెంటనే ఆయన చేత ప్రస్తుతం అమెరికా బలగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్‌ టామ్‌ మూయిర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెను వెంటనే అస్టిన్‌ విధుల్లో చేరారు.

ట్రంప్‌ అభిశంసనపై ఫిబ్రవరి 8న సెనేట్‌లో విచారణ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసనపై ఫిబ్రవరి 8నుంచి సెనేట్‌లో విచారణ మొదలు కానుంది. ఈ నెల 6న క్యాపిటల్‌ భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పి అరాచకం సృష్టించడమే కాకుండా అయిదు నిండు ప్రాణాలు బలైపోవడానికి పరోక్షంగా కారణమవడంతో ట్రంప్‌పై ఇప్పటికే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానిని ప్రతినిధుల సభ ఆమోదించడం తెలిసిందే.  

ట్రంప్‌ ప్రస్తుతం గద్దె దిగిపోయినప్పటికీ అభిశంసన ప్రక్రియను అధికారికంగా ముగించాలన్న గట్టి పట్టదలతో డెమొక్రాట్లు ఉన్నారు.  ఫిబ్రవరి 8 సోమవారం సభ ప్రారంభం కాగానే ట్రంప్‌ అభిశంసనే ప్రధాన ఎజెండగా ఉంటుంది. ఆయనపై నమోదు చేసిన అభియోగాలను చదువుతారు. ఆ మర్నాడు కొత్త సెనేట్‌ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 100 మంది సభ్యుల బలం ఉండే సెనేట్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు సరిసమానంగా చెరి 50 స్థానాలున్నాయి. సెనేట్‌ చైర్మన్, దేశ ఉపాధ్యక్షురాలు కమల ఓటుతో డెమొక్రాట్లదే సభలో ఆధిక్యం ఉంటుంది.

మరిన్ని వార్తలు