లండన్‌లో కఠిన ఆంక్షలు!

15 Dec, 2020 05:03 IST|Sakshi
లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో యాంటీ వ్యాక్సినేషన్, యాంటీ లాక్‌డౌన్‌ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు

లండన్‌: కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. లండన్‌లో ఆంక్షలను మరింత కఠినం చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లండన్‌లో కఠినమైన ‘టయర్‌ 3’ ఆంక్షలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నట్లు ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ పేర్కొంది. ఈ విషయంపై లండన్‌ ఎంపీలకు అధికారులు సమాచారమిచ్చారని తెలిపింది. అయితే, దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, దేశ రాజధాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నిర్ణయాలు వద్దని లండన్‌ మేయర్‌ సాదిఖ్‌ ఖాన్‌ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. లండన్‌లో టయర్‌ 3 ఆంక్షలను విధించే విషయమై ఆరోగ్య శాఖ  మంత్రి మాట్‌ హాంకాక్‌ ప్రతినిధుల సభలో త్వరలో ఒక ప్రకటన చేయనున్నారు. ‘టయర్‌ 3’లో.. ఎక్కువమంది పాల్గొనే అన్ని బహిరంగ కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. బార్లు, పబ్‌లు, కెఫేలు, రెస్టారెంట్లను మూసివేస్తారు. వాటి నుంచి ‘టేక్‌ అవే’కు మాత్రం అవకాశముంటుంది. థియేటర్లను మూసివేస్తారు. పౌరులు టయర్‌ 3 ఆంక్షలున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు ప్రయాణించకూడదు.

మరిన్ని వార్తలు