రూ.690 కోట్ల పెయింటింగ్‌.. ఆం‍దోళనకారులు చేసిన పనికి అందరూ షాక్‌..

14 Oct, 2022 19:36 IST|Sakshi

లండన్‌: డచ్‌ కళాకారుడు వాన్‌ వోగ్‌ వేసిన పొద్దుతిరుగుడు పెయింటింగ్‌ ప్రపంచ మేటి కళాకండాల్లో ఒకటి. 1888 నాటి ఈ పెయింటింగ్ విలువ 84 మిలియన్‌ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 690 కోట్ల రూపాయలు. అందుకే దీన్ని లండన్‌లోని జాతీయ గ్యాలరీలో 43వ గదిలో అత్యంత భద్రంగా ఉంచారు. అయితే ఇంతటి చారిత్రక పెయింటింగ్‌పై ఇద్దరు ఆందోళనకారులు టమాటో సూప్ విసిరారు. దీంతో అక్కడున్న వారంతా 'ఓ మై గాడ్' అంటూ షాక్‌లో నోరెళ్లబెట్టారు.

ప్రస్తుతం బ్రిటన్‌లో 'జస్ట్ స్టాప్ ఆయిల్' ప్రచారంతో ఉద్ధృత ఆందోళనలు కొనసాగుతున్నాయి. అకాశాన్నంటిన చమురు, గ్యాస్ ధరలను నిరసిస్తూ అనేక మంది నిరసన బాట పట్టారు. ఇందులో భాగంగానే ఇద్దరు నిరసనకారులు నేషనల్ గ్యాలరీ ఉన్న వాన్ వోగ్‌ పెయింటింగ్‌పైకి టమాటో సూప్ విసిరారు.

కళ విలువైందా? ప్రాణం విలువైందా? ఆహారం కంటే ఇది అంత ముఖ్యమైందా? ప్రపంచం, మనుషుల కంటే పెయింటింగ్‌కు రక్షణ కల్పించడమే ముఖ్యమా? అని ఇద్దరు ఆందోళనకారుల్లో ఒకరు ప్రశ్నించారు.

అయితే టామాటో సూప్ విసిరినప్పటికీ పెయింటింగ్‌కు ఏమీ కాలేదని నేషనల్ గ్యాలరీ  నిర్వాహకులు తెలిపారు. కానీ పెయింటింగ్‌కు రక్షణ కల్పించే గాజు ప్రేమ్ కొంచెం దెబ్బతిన్నట్లు వెల్లడించారు. చారిత్రక పెయింటింగ్‌పైకి టమాటో సూప్ విసిరినందుకు ఇద్దరు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం

మరిన్ని వార్తలు