-

ఓలాకు షాక్ : లండన్‌లో బ్యాన్

5 Oct, 2020 15:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  దేశీయ క్యాబ్ సేవల సంస్థ ఓలాకు లండన్‌లో ఎదురు దెబ్బ తగిలింది. ప్రజా రవాణా భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలతో ఓలాకు చెందిన ఆపరేటింగ్ లైసెన్స్  ను లండన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ రద్దు చేసింది.  ఓలా భద్రతా చర్యలు నిబంధనలకు అనుగుణంగా లేవని, ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఈ మేరకు  ట్రాన్‌పోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్‌ఎల్) ఒక ప్రకటన జారీ చేసింది. 

మరో క్యాబ్ సేవల సంస్థ, ఓలా ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ గతంలో భద్రతాపరమైన కారణాల రీత్యా ఇలాంటి చర్యలనే ఎదుర్కొంది. అయితే చట్టబద్ధమైన నిబంధనలు తొలగి, లైసెన్స్‌ తిరిగి సాధించిన సేవలకు సుగమమైన తరుణంలో ఓలాకు వ్యతిరేకంగా తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. ఓలా సేవల్లో అనేక వైఫల్యాలను కనుగొన్నట్లు టీఎఫ్ఎల్ తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలతో సహా, లైసెన్స్ లేని డ్రైవర్లు వాహనాలను నడుపుతున్నారని వాదించింది. దీనిపై  అప్పీల్ చేయడానికి ఓలాకు 21 రోజులు (అక్టోబర్ 24) సమయం ఉందని తెలిపింది. దీనిపై స్పందించిన ఓలా డేటా బేస్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వెల్లడించింది. ఈ విషయంలో టీఎఫ్‌ఎల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతామని, పారదర్శకంగా పనిచేయడానికే తమ ప్రాధాన్యత అని ఓలా యూకే ఎండీ మార్క్ రోజెండల్ తెలిపారు.   దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కాగా బెంగళూరుకు చెందిన ఓలా ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్ టాక్సీ మార్కెట్లోకి ప్రవేశించింది. భారతదేశంలో ఉబెర్‌తో పోటీపడుతున్న భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని సంస్థ యుకెతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు తన సేవలను విస్తరించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు