Covid Effect On Children: పిల్లలపై కోవిడ్‌ ప్రభావం తక్కువే

5 Aug, 2021 03:55 IST|Sakshi

చిన్నారుల్లో కరోనాపై యూకేలో లోతైన అధ్యయనం

దీర్ఘకాలిక కోవిడ్‌ లక్షణాలు లేవు

లండన్‌: చిన్నారులపై కోవిడ్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు యూకేలో భారీ అధ్యయనం జరిగింది. కోవిడ్‌ సోకిన చిన్నారుల్లో అత్యధిక శాతం మందిలో కరోనా లక్షణాలు ఆరు రోజులకు మించి ఉండట్లేదని తాజా పరిశోధనలో తేలింది. ఈ అధ్యయన వివరాలు లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనను లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ నిపుణులు 2020 సెప్టెంబర్‌ 1 నుంచి 2021 ఫిబ్రవరి 22 వరకూ జరిపారు.

జోయ్‌ కోవిడ్‌ స్టడీ అనే స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ద్వారా చిన్నారుల తల్లిదండ్రులు, టీనేజర్ల నుంచి సమాచారం సేకరించారు. మొత్తం మీద 17 ఏళ్ల లోపు ఉన్న రెండున్నర లక్షల మంది యూకే చిన్నారుల మీద ఈ ప్రయోగం జరిగింది. కరోనా సోకిన చాలా మంది చిన్నారుల్లో లక్షణాలు లేవని అధ్యయనంలో తేలింది. మొత్తంమీద అధిక శాతం చిన్నారులు కేవలం నాలుగు వారాల్లో పూర్తిగా కోలుకున్నారని   పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ ఎమ్మా చెప్పారు.

నీరసమే లక్షణం..
కోవిడ్‌ సోకిన చిన్నారుల్లో అత్యంత ఉమ్మడిగా కనిపించిన అంశం నీరసంగా ఉండటమేనని పరిశోధనలో పాల్గొన్న తల్లిదండ్రులు తెలిపారు. 84 శాతం మంది పిల్లల్లో నీరసం కనిపించినట్లు పేర్కొన్నారు.8వారాలు దాటిన తర్వాత కూడా కోవిడ్‌ లక్షణాలు ఉన్న పిల్లలు కేవలం 2శాతం మాత్రమే కావడం గమనార్హం. కరోనా వైరస్‌ సోకి కోలుకున్న తర్వాత చిన్నారుల్లో జలుబు కొనసాగిందని అధ్యయనంలో తేలింది. మహమ్మారి తర్వాత పరిస్థితుల్లో చిన్నారులను సురక్షితంగా కాపాడుకోవడానికి ఈ లక్షణాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని తెలిపారు.

మరిన్ని వార్తలు