ఎలక్ట్రిక్ కారు : టెస్లాకు లూసిడ్ షాక్

3 Sep, 2020 16:17 IST|Sakshi

ప్రపంచంలోనే అతివేగవంతమైన  సెడాన్ లూసిడ్  ఎయిర్

9.9 సెక్లన్లలోనే పావు మైలు  పరుగు 

ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్టప్ కంపెనీ లూసిడ్ మోటార్స్ ఆధునిక టెక్నాలజీకి,విలాసానికి పెట్టింది పేరైన టెస్లాకు షాకివ్వనుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీల ప్రత్యేకతను చాటుకుంటున్న టెస్లాకు ధీటుగా కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనుంది. తాజాగా తన లేటెస్ట్ లూసిడ్ ఎయిర్ ఎలక్ట్రిక్ కారు వీడియోను  విడుదల చేసింది. ఇది కేవలం పది సెక్లలోనే పావు మైలు దూసుకెళ్లి  ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థ  టెస్లా మోడల్ ఎస్ కారును వెనక్కి నెట్టేసింది.

డ్యూయల్-మోటార్,ఆల్-వీల్-డ్రైవ్ ప్యాకేజీలో 1080 వరకు బిహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుందని లూసిడ్ ప్రకటించింది. లూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ క్వార్టర్-మైలును 9.9 సెకన్ల కంటే తక్కువ సమయంలోనే సాధించిందని, తద్వారా ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సెడాన్‌గా నిలిచిందని, దీన్ని అమెరికన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ధృవీకరించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  టెస్లా మోడల్ ఎస్ కంటే మెరుగైన రేటింగ్ లభించిందని పేర్కొంది.

లూసిడ్ మోటార్స్ తన మొదటి కారు లూసిడ్ ఎయిర్ సెడాన్ ను వచ్చే వారం (సెప్టెంబరు 9న) లాంచ్ చేయనుంది. ఈ కారు పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 517 మైళ్ళు (అంటే దాదాపు 832 కి.మీ) ప్రయాణిస్తుందని లూసిడ్ మోటార్స్ పేర్కొంది. ఈ కారు ప్రారంభ ధర లక్ష డాలర్లుగా ఉంటుందని తక్కువ విలువైన మోడళ్లను త్వరలో విడుదల చేస్తామని లూసిడ్ మోటార్స్ సీఈఓ పీటర్ రావ్లిన్సన్ చెప్పారు. ఫార్ములా ఈ టెక్నాలజీతో రానున్న19 కిలోవాట్ల వండర్ బాక్స్ చార్జర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 

మరిన్ని వార్తలు