అడవికి ఊపిరి.. తుపాకీకి ఉరి

13 Jan, 2023 03:24 IST|Sakshi

బ్రెజిల్‌ కొత్త అధ్యక్షుడు లూలా    ముందున్న సవాళ్లు

గన్‌ కల్చర్, గోల్డ్‌ మైనింగ్‌ కట్టడికి చర్యలు షురూ  

కొత్త సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి బ్రెజిల్‌ గద్దెనెక్కిన  లూలా డ సిల్వా రెండు కీలక అంశాలపై దృష్టి సారించారు. జనవరి 1న దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు తుపాకుల సంస్కృతిని కట్టడి చేస్తానని, అమెజాన్‌లో బంగారం తవ్వకాలకు అడ్డుకట్ట వేసి అడవులకి కొత్త ఊపిరిలూదుతానని ప్రకటించారు. ఈ రెండు అంశాలు లూలా ప్రభుత్వానికి ఎందుకంత ప్రాధాన్యంగా మారాయి ?  వామపక్ష భావజాలం కలిగిన నాయకుడైన లూలా రెండు పర్యాయాల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి జన హృదయాలను గెలుచుకున్నారు. వీటిని కూడా నెరవేరిస్తే ఆయన పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయం.  

సరిగ్గా 20 ఏళ్ల కిందట బ్రెజిల్‌ అధ్యక్షుడిగా లూలా డ సిల్వా తొలిసారి అధ్యక్షుడైనప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ సారి ఎన్నికల్లో లూలా అత్యంత స్వల్ప మెజార్టీతో నెగ్గారు. 50.9% ఓటు షేర్‌ లూలాకు వస్తే, మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోకి 49.1% ఓట్లు వచ్చాయి. కేవలం రెండు శాతం ఓట్లతో తేడాతో నెగ్గిన లూలా తాను అనుకున్నవీ ఎంత సాధించగలరో అన్న అనుమానాలైతే ఉన్నాయి. ఇప్పటికే బోల్సోనారో మద్దతుదారులు రోడ్లపైకెక్కి తిరిగి తమ నాయకుడినే అధ్యక్షుడిని చేయాలంటూ దేశాన్ని రణరంగంగా మారుస్తున్నారు. శాంతి భద్రతలకే సవాల్‌ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో లూలా తన పీఠాన్ని కాపాడుకోవడానికే సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తోంది.

దేశానికి ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 4.4 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేసి ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్న లూలా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక అవినీతి ఆరోపణలపై జైల్లో గడపడంతో ఆయనపైనున్న విశ్వాసం కొంతవరకు  ప్రజల్లో సన్నగిల్లింది. ఆ తర్వాత కేసుల నుంచి విముక్తుడైనప్పటికీ తుపాకుల సంస్కృతిని, అమెజాన్‌ అడవుల్ని కాపాడితే మరోసారి లూలా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయం. అందుకే తన ప్రమా ణ స్వీకారం రోజే బోల్సోనారో తుపాకులు సులభంగా కొనుక్కోవడానికి వీలుగా జారీ చేసిన డిక్రీలను రద్దు చేశారు. తుపాకుల నియంత్రణకు, బంగారం తవ్వకాలకి సంబంధించి కొత్త డిక్రీలు జారీ చేసి అభిమానుల నుంచి జేజేలు అందుకున్నారు.  

పెచ్చు మీరుతున్న తుపాకుల సంస్కృతి  
బ్రెజిల్‌లో మార్కెట్‌కి వెళ్లి బీన్స్‌ కొనుక్కోవడం ఎంత తేలికో తుపాకుల కొనుగోలు కూడా అంతే సులభం. జైర్‌  బోల్సోనారో 2019 జనవరి 1న దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక తుపాకుల నియంత్రణ చట్టాలను సులభతరం చేశారు. గన్‌ లైసెన్స్‌లకుండే  గడువుని అయిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. దీంతో ఆత్మరక్షణ పేరుతో తుపాకుల్ని విచ్చలవిడిగా కొనేవారి సంఖ్య పెరిగిపోయింది. తుపాకుల మరణాల్లో ప్రపంచంలో బ్రెజిల్‌ మొదటి స్థానంలో ఉంది.

సగటున ఏడాదికి 40 వేల మంది మృత్యువాత పడడం చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాల్ని బహిరంగంగా ప్రశంసించే బోల్సోనారో అమెరికా బాటలో విచ్చలవిడి తుపాకుల విక్రయానికి తెరతీశారు. దీంతో బ్రెజిల్‌ తుపాకుల కాల్పుల ఘటనతో రక్తమోడుతోంది. లూలా డ సిల్వా అధ్యక్షుడయ్యాక తుపాకుల నియంత్రణకి చేపడుతున్న చర్యలు  ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి.  ఒక సర్వే ప్రకారం దేశంలో మూడింట రెండు వంతుల మంది ప్రజలు తుపాకులు ప్రజల చేతుల్లో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు.   
అమెజాన్‌ అడవుల్లో గోల్డ్‌ మైనింగ్‌  
అమెజాన్‌ అటవీ ప్రాంతంలో 60శాతానికిపైగా బ్రెజిల్‌లో ఉంది. భూమ్మీద ఉండే ఆక్సిజన్‌లో 10శాతం ఇక్కడ నుంచి వస్తూ ఉండడంతో భూమాతకి ఊపిరితిత్తులుగా అమెజాన్‌ను అభివర్ణిస్తారు. ప్రపంచంలో అతి పెద్ద అన్‌రిజిస్టర్డ్‌ మైనింగ్‌ ఇండస్ట్రీకి ఈ అడవులే వేదికయ్యాయి.  గనుల నుంచి బంగారాన్ని వెలికి తీయడానికి పాదరసాన్ని వాడుతుంటారు. ఈ పాదరసంతో అమెజాన్‌ నదుల్లో నీరు విషతుల్యంగా మారుతున్నాయి. దీంతో ఈ అడవుల్లో ఉన్న 25 లక్షల రకాల జీవజాలానికి ముప్పు ఏర్పడుతోంది. అడవుల్లో నివసించే స్థానిక గిరిజనులకు గోల్డ్‌ మైనర్ల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బ్రెజిల్‌ అటవీ ప్రాంతంలో బంగారం స్మగ్లర్లను గారింపీర్స్‌ అని పిలుస్తారు.

వీరందరి వెనకాల మాజీ అధ్యక్షుడు బోల్సోనారో ఉన్నారనే ప్రచారం ఉంది. బోల్సోనారో తండ్రి కూడా గారింపీర్‌ కావడంతో అమెజాన్‌ అడవులు నాశనం కావడానికి బోల్సోనారో కుటుంబమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  కరోనా సంక్షోభ సమయంలో అయిదు నెలల కాలంలో బంగారం ధరలు 40% పెరిగిపోవడంతో గోల్డ్‌ స్మగ్లర్లు ఈ ప్రాంతంలో తమ పట్టు పెంచుకున్నారు. వీరికి రాజకీయ నేతల అండదండలు  ఉండడంతో వీరిని కాదని  చర్యలు తీసుకోవడం అంత సులభం కాదు.  అధ్యక్ష ఎన్నికల్లో అమెజాన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని జిల్లాల్లోనూ బోల్సొనారో కంటే లూలా వెనుకబడ్డారు. అందుకే ఆయన ప్రతీ నిర్ణయం ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది.  

► ప్రపంచ మార్కెట్‌లో లభ్యమయ్యే బంగారంలో 20% అమెజాన్‌ అడవుల నుంచే వస్తుంది.  
► ఈ గోల్డ్‌ మైనింగ్‌లు 2 లక్షల మందికి జీవనాధారంగా ఉన్నాయి.  
► అమెజాన్‌లో  బంగారం తవ్వకాల కోసం 2017 నుంచి అడవుల నరికివేత పెరిగిపోతోంది.  
► అమెజాన్‌ అటవీ విస్తీర్ణం ఇప్పటికే 20% తగ్గిపోయింది. అంటే ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల సైజుతో ఇది సమానం. ఇందులో మైనింగ్‌ కోసమే 90% చెట్లను నరికేశారు.
► పర్యావరణ పరిరక్షణ చట్టాలను మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తుంగలో తొక్కడంతో 2019లో అమెజాన్‌ అడవుల్లో 10,500 హెక్టార్ల విస్తీర్ణం తగ్గిపోయింది.  
► 2018 సంవత్సరంతో పోలిస్తే గోల్డ్‌ మైనింగ్‌ కోసం 2019లో  23% అధికంగా, 2020 నాటికి   80శాతం అధికంగా అడవుల్ని నరికివేశారు.
► ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో తుపాకుల సంఖ్య దాదాపుగా 20 లక్షలకి చేరుకుంది.  
► 2018తో పోల్చి చూస్తే తుపాకుల్ని వినియోగించే ప్రజల సంఖ్య రెట్టింపైంది.  
► గత ఏడాది జులైలో తుపాకులకి లైసెన్స్‌ ఇచ్చే సంస్థ సీఏసీ దగ్గర 6 లక్షలకు పైగా తుపాకుల లైసెన్స్‌ మంజూరు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
► 2018తో పోల్చి చూస్తే ఇది ఏకంగా 500% ఎక్కువ.
► 2019లో అత్యధికంగా 49,436 మంది తూటాలకు బలయ్యారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు