ఇంగ్లండ్‌లో ఎండ దెబ్బకు కరిగిన రన్‌వే

19 Jul, 2022 04:34 IST|Sakshi

కేంబ్రిడ్జ్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు  

లండన్‌: ఇంగ్లాండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వాహనాలకు నిప్పంటుకుంటోంది. గడ్డి భూములు అగ్నికి ఆహూతవుతున్నాయి. రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎండలను తట్టుకోలేక ప్రజలు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు.

ఈత కొలన్లలో సేదతీరుతున్నారు. ఎండ దెబ్బకు లూటన్‌ ఎయిర్‌పోర్టులో రన్‌వే కరిగిపోయింది! దాంతో విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. సోమవారం కేంబ్రిడ్జ్‌లో 38 డిగ్రీలు, లండన్‌లో 37.5 డిగ్రీలు నమోదైంది! సూర్యప్రతాపం వల్ల అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. లండన్‌లోని వాక్స్‌హాల్‌ ప్రాంతంలో రైలు పట్టాలు వ్యాకోచించి, వంగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

లండన్‌లో వుడ్‌గ్రీన్‌ క్రౌన్‌ కోర్టులో ఏసీ యూనిట్‌ పేలిపోవడంతో ఓ మర్డర్‌ కేసులో విచారణను వాయిదా వేశారు. యూకేలో వాతావరణం సహారా ఎడారిని తలపిస్తోందంటూ జనం సోషల్‌ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలు ఇంకా భయపెడుతున్నాయి.

మరిన్ని వార్తలు