రికార్డులకు అతుక్కుపోతాడు

19 Jul, 2022 03:17 IST|Sakshi

పిల్లలను ఆడించడానికి రకరకాల వేషాలేస్తారు పెద్దవాళ్లు. అలా కూల్‌డ్రింక్స్‌ క్యాన్లను అతికించుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడో వ్యక్తి. యూఎస్‌కు చెందిన జామీ కీటన్‌ది అసాధారణ చర్మం. ఆక్సిజన్‌ ఎక్కువగా తీసుకునే లక్షణం ఉన్న జామీ చర్మానికి అతుక్కునే గుణం ఎక్కువ. ఏడేళ్ల వయసులోనే ఇది గుర్తించిన జామీ... బొమ్మలు అతికించుకోవడం మొదలుపెట్టాడు.

అల్లరివాడు కాబట్టి ఏ చెట్లెక్కి గమ్‌ అంటించుకున్నాడోనని అతని తల్లిదండ్రులు తేలికగా తీసు­కున్నారు. కానీ ఓసారి గుండు చేసుకుని బేస్‌బాల్‌ ఆడుతున్న టైమ్‌లో తలకు కూల్‌డ్రింక్‌ టిన్‌ అతుక్కుపోయింది. పరుగెత్తినా పడిపోలేదు. అలా తనలోని ప్రత్యేకతను తెలుసుకున్నాడు. 2016లో తలకు 8 క్యాన్లను అతికించుకొని గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత 2019లో జపాన్‌కు చెందిన షునుచి కన్నో తొమ్మిది క్యాన్లతో జామీ రికార్డును బ్రేక్‌ చేశాడు.

ఇప్పుడు పది క్యాన్లను తలపై అతికించుకొని ఆ రికార్డును దాటేశాడు జామీ. ఖాళీ క్యాన్లను తలపై అతికించుకోవడమే కా­దు.. బరువున్న బాటిల్స్‌ను కూడా క్యారీ చేయగలడు. బాటిల్స్‌ను తలకు అతికించు­­కుని వాటిలోని డ్రింక్‌ను గ్లాస్‌ల్లోకి ఒంపే టెక్నిక్‌ను నేర్చుకున్నాడు. తనకున్న ప్రత్యేకతనే బిజినెస్‌గా ఎంచుకుని, పలు కంపెనీలకు మార్కెటింగ్‌ చేస్తూ.. వీకెండ్స్‌లో 10 నుంచి 20వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. ‘సెలబ్రిటీస్‌కు కూడా నేను తెలిసిపోయాను. సాధారణంగా వాళ్లతో ఫొటోలు దిగాలని అందరూ కోరుకుంటారు. కానీ సెలబ్రిటీలే నాతో ఫొటోస్‌ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు’అంటున్నాడు జామీ.   

మరిన్ని వార్తలు