పాక్‌లో దుశ్చర్య: మహారాజా రంజిత్‌సింగ్‌ విగ్రహం ధ్వంసం

17 Aug, 2021 18:39 IST|Sakshi
విగ్రహాన్ని కూలుస్తున్న యువకులు

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో కొం‍దరు యువకులు రెచ్చిపోయారు. సిక్కుల ఆరాధ్య దైవం మహారాజ రంజిత్‌సింగ్‌ విగ్రహాన్ని మూడోసారి పగులగొట్టి వారి విద్వేషాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ ఘటన పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లోని లాహోర్‌ కోటలో జరిగింది. లాహోర్‌ కోట సమీపంలో ప్రతిష్టించిన రంజిత్‌ సింగ్‌ ​విగ్రహాన్ని తాజాగా మంగళవారం కూల్చివేశారు. తెహ్రీక్‌-ఇ-లబైక్‌ (టీఎల్‌ఎఫ్‌) అనే రాడికల్‌ గ్రూప్‌ సభ్యులు విగ్రహంపై దాడి చేసి ధ్వంసం చేశారు.

సిక్కుల ఆరాధ్య దైవం రంజిత్‌సింగ్‌. ఆయన లాహోర్‌ రాజధానిగా సిక్కు రాజ్యాన్ని ఏర్పాటుచేశాడు. ఆయన జ్ఞాపకార్థం లాహోర్‌ కోట సమీపంలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని 180వ వర్ధంతి సందర్భంగా 2019 జూన్‌లో ఆవిష్కరించారు. ఇప్పటికే రెండుసార్లు రంజిత్‌సింగ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో రెండు నెలల కిందట కొత్తగా ఏర్పాటుచేశారు.

ఈ విగ్రహాన్ని వాల్డ్‌సిటీ ఆఫ్‌ లాహోర్‌ అథారిటీ (డబ్ల్యూసీఎల్‌ఏ) ఆధ్వర్యంలో యూకేకు చెందిన సిక్కు హెరిటేజ్‌ ఫౌండేషన్‌ నిర్మించింది. తాజాగా మరోసారి విగ్రహం ధ్వంసం చేయడంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్‌.. జైల్లోనే
చదవండి: మొదలైన తాలిబన్ల అరాచకం: ఇంటింటికెళ్లి నగదు లూటీ

మరిన్ని వార్తలు