పాక్‌లో మళ్లీ లాక్‌డౌన్‌..

14 Mar, 2021 15:33 IST|Sakshi

లాహోర్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు కోరలు చాచుతున్న వేళ.. దాయాది దేశం పాకిస్తాన్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని ఏడు నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో లాహోర్, రావల్పిండి, సర్గోధ, ఫైసలాబాద్, ముల్తాన్, గుజ్రన్‌వాలా, గుజరాత్ నగరాల్లో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అంక్షలు అమల్లోకి రానున్నాయి. సోమవారం నుంచి ఏడు నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ పాటించాలని స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 

గతేడాది మార్చిలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించిన తరువాత పాకిస్తాన్‌ వ్యాప్తంగా మళ్ళీ లాక్‌డౌన్ విధించే పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో విమానాలపై విధించిన ఆంక్షల వ్యవధిని కూడా పాక్‌ ప్రభుత్వం పొడిగించింది. ఈ పరిమితులను మార్చి 18 వరకు పొడిగించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఇప్పటి వరకు పాక్‌ వ్యాప్తంగా 6 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 13,476 మంది మరణించినట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు