ఫ్రాన్స్‌ను ముస్లింలు శిక్షించవచ్చు

31 Oct, 2020 06:33 IST|Sakshi

మలేసియా మాజీ ప్రధాని మహథిర్‌ మహ్మద్‌ ట్వీట్‌

పారిస్‌: ఫ్రాన్స్‌ను శిక్షించే అధికారం ముస్లింలకు ఉందంటూ మలేసియా మాజీ ప్రధానమంత్రి మహథిర్‌ మహ్మద్‌ చేసిన ట్వీట్‌ తీవ్ర సంచలనానికి తెరతీసింది. ఆయన శుక్రవారం తన ట్విట్టర్‌ ఖాతా నుంచి వరుసగా 13 ట్వీట్లు చేశారు. ‘‘ఫ్రాన్స్‌ గతంలో నరమేధం సాగించింది. అందుకు ప్రతీకారంగా లక్షలాది మంది ఫ్రెంచ్‌ పౌరులను హతమార్చే అధికారం ముస్లింలకు ఉంది. కానీ, కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని ముస్లింలు పాటించరు. ఫ్రాన్స్‌ కూడా అందుకు కట్టుబడి ఉండాలి. ఇతర మతస్తుల మనోభావాలను గౌరవించడం ఫ్రాన్స్‌ ప్రజలకు అక్కడి ప్రభుత్వం నేర్పాలి’’అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది సోషల్‌ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మహథిర్‌ మహ్మద్‌పై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌ డిజిటల్‌ సెక్టార్‌ సెక్రెటరీ సెడ్రిక్‌ ఓ వెంటనే రంగంలోకి దిగారు. మహథిర్‌ చేసిన ట్వీట్‌ను తక్షణమే తొలగించాలని ట్విట్టర్‌ యాజమాన్యాన్ని కోరారు. దీంతో ట్విట్టర్‌ యాజమాన్యం మహథిర్‌ మహ్మద్‌ ట్వీట్‌ను తొలగించింది.

చర్చి ఘటనలో మరొకరి అరెస్టు
నైస్‌(ఫ్రాన్స్‌): ఫ్రాన్స్‌లో నైస్‌ నగరంలోని చర్చిలో జరిగిన నరమేధంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్యునీషియాకు చెందిన ఇబ్రహీం ఇస్సాయ్‌ అనే ముష్కరుడు చర్చిలో కత్తితో దాడి చేయడంతో ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 47 ఏళ్ల ఈ అనుమానితుడు కత్తితో దాడి చేసిన ముష్కరుడితో అంతకు మందు రోజు రాత్రే మాట్లాడినట్లు తెలుస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా