వింత ఘటన: గుండె లేకుండా బతికిన.. ప్రపంచంలోనే తొలి మానవుడు

7 Jan, 2023 17:12 IST|Sakshi

సాటి మానవుల పట్ల జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తే.. నీకు అసలు హృదయమే లేదంటూ నిందిస్తాం. అసలు మానవుడి గుండె ఒక్కనిమిషం ఆగినా చనిపోయినట్లే. అలాంటిది అసలు గుండె లేకుండా బతకడమేమిటి. నిజమేనా! అన్న డౌటు వస్తుంది ఎవరికైనా. ఎలా చూసినా, ఏవిధంగా ఆలోచించినా అది అసాధ్యం. కానీ ఇక్కడొక మనిషిని చూస్తే ఔను! అని తల ఊపకతప్పదు. ఈ అత్యంత ఆశ్చర్యం కలిగించే ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..క్రెయిగ్‌ లూయిస్‌ అనే 55 ఏళ్ల వ్యక్తి 2011లో అమిలోయిడోసిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది అసాధారణమైన ప్రోటీన్‌ల పెరుగుదలకు కారణమయ్యే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి వేగంగా గుండె, మూత్రపిండాలు, కాలేయంపై దాడి చేసి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో టెక్సాస్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన డాక్టర్‌ బిల్లీకోన్‌, డాక్టర్‌ బడ్‌ ఫ్రేజియర్‌, లూయిస్‌ రక్తాన్ని పల్స్‌ లేకుండా రక్తం ప్రసరించడానికి సహాయపడే పరికరాన్ని అమర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరికరాన్ని ఆ ఇద్దరు వైద్యులే రూపొందించారు. ఆ వైద్యులు ఈ పరికరాన్ని దాదాపు 50 దూడలపై పరీక్షించారు. వారు ఆయా జంతువుల హృదయాలను తీసేసి వాటి స్థానంలో ఈ పరికరాన్ని అమర్చారు.

అవి తమదైనందిన విధులను గుండె లేకుండానే నిర్వర్తించగలిగాయి. అంతేగాదు సెతస్కోపును ఆవు ఛాతి వద్ద పెట్టి వింటే గుండె చప్పుడూ వినిపించదు. మనం ఈసీజీ పరీక్ష చేసిన ప్లాట్‌లైన్‌ చూపిస్తుందని డాక్టర్‌​ కోన్‌ చెప్పుకొచ్చారు. ఐతే లూయిస్‌ పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో అతని భార్య లిండా ఆపరికరాన్ని తన భర్త శరీరంలోకి అమర్చడానికి వైద్యులకు అనుమతిచ్చింది. ఈ మేరకు వైద్యులు అతడి గుండెను తీసివేసి ఈ పరికరాన్నిఅమర్చారు.

ఇది శరీరంలో నిరంతరం ప్రవహిస్తున్న రక్తం ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. ఈ పరికరాన్ని అమర్చడానికి ముందు లూయిస్‌ని డయాలసిస్‌ మెషిన్‌, శ్వాసయంత్రం తోపాటు బాహ్య రక్త పంపుపై ఉంచారు. భార్య లిండా తన భర్త పల్స్‌ విన్నప్పుడూ ఆశ్చర్యపోయింది. అతనికి పల్స్‌ లేదని, ఇది చాలా అద్భుతమైనదని ఆమె చెబుతోంది. కానీ పాపం ఆ వ్యాధి కాలేయం, మూత్రపిండాలపై దాడి చేయడంతో లూయిస్‌ పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. అతను ఇలా పల్స్‌ లేకుండా ఒక నెలకుపైగా జీవించాడు. ఐతే శరీరానికి అమర్చిన పంపులు సరిగా పనిచేయకపోవడంతోనే అతను మరణించాడని వైద్యులు ధృవీకరించారు.  దీంతో ప్రపంచంలోనే గుండె లేకుండా జీవించిన తొలి మానవుడిగా లూయిస్‌ నిలిచాడు. 

(చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్‌ ఇండియా సీఈఓ)

మరిన్ని వార్తలు