కుక్కను కరిచాడు!

23 Apr, 2022 04:46 IST|Sakshi

ఫెయిర్‌ఫీల్డ్‌: మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, మనిషే కుక్కను కరిస్తే వార్త అనే మాటను అక్షరాలా నిజం చేసాడో ప్రబుద్ధుడు. అమెరికాలో ఒక దొంగ మంచి టైమ్‌ చూసుకొని వృద్ధులున్న ఇంటికి కన్నం వేశాడు. దొంగతనం పూర్తయి పారిపోదామనుకునే సమయంలో ఆ ఇంటికి అమెజాన్‌ డెలివరీ బాయ్‌ వచ్చాడు. తను పారిపోయేందుకు డెలివరీ ట్రక్కును, లేదంటే చంపేస్తానని బాయ్‌ను దొంగ బెదిరించాడు. దీంతో భయపడిన అమెజాన్‌ బాయ్‌ పోలీసులకు ఫోన్‌ చేయడంతో పోలీసులు సదరు ఇంటిని చుట్టుముట్టారు.

ఎంత ప్రయత్నించినా దొంగను బయటకు రప్పించలేకపోవడంతో చివరకు పోలీసు జాగిలం కార్ట్‌(కే9)తో కలిసి ఇంట్లోకి వెళ్లారు. దొంగను గుర్తించిన కుక్క అతన్ని పట్టుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దొంగ కుక్కను కరిచి, కత్తితో పొడిచాడని పోలీసులు ప్రకటించారు. చికిత్స కోసం కుక్కను ఆస్పత్రికి పంపారు. దొంగ మత్తు పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై పాత కేసులున్నా యని పోలీసులు గుర్తించారు. కొత్తగా కుక్కను కరిచినందుకు, ట్రక్కు దొంగతనానికి, ఇంట్లో దొంగతనానికి కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు