గుర్రంలా సకిలించినందుకు జైలుశిక్ష

8 Aug, 2021 14:36 IST|Sakshi

డోలు.. డోలు కొట్టుకుంటే మధ్యలో ఉన్న మద్దెలను వాయించినట్లు... రష్యాలోని ఓ భార్యభర్తల గొడవ, వీధి ప్రజల నిద్రను మాయం చేసింది. అది కూడా సుమారు రెండున్నర సంవత్సరాల పాటు. కారణం, రోజూ వారి గొడవలు వినలేక కాదు, గుర్రం సకిలింతలు వినలేక. భార్యభర్తల గొడవల మధ్యలో గుర్రం సకిలింతలు ఏంటని ఆలోచిస్తున్నారా? నిజానికి ఆ భార్యభర్తలు గొడవపడి, విడిపోయి మూడు సంవత్సరాలు అవుతోంది.

కానీ, అతను మాత్రం భార్య తనని వదిలేసి వెళ్లడాన్ని జీర్ణించుకోలేపోయాడు. ఆ అవమానం, బాధ తట్టుకోలేక కుమిలిపోయాడు. చివరకు మతిస్థిమితం కోల్పోయి, ఓ సైకోలా తయారయ్యాడు. ఎంతలా అంటే కేవలం వీధి ప్రజల నిద్ర చెడగొట్టడానికి వేల రూపాయలు ఖర్చు చేసి, ఓ పెద్ద సౌండ్‌ సిస్టమ్, స్పీకర్స్‌ కొన్నాడు. ఇక రోజూ వాటిని ఉపయోగించి, ప్రతిరోజూ గుర్రంలా సకిలిస్తూ, ఆ శబ్దాలతో హోరెత్తించేవాడు.

అలా సుమారు రెండన్నర సంవత్సరాల పాటు కొనసాగించాడు. అతని బాధ చూడలేక కొంతమంది, అతన్ని మానసికవైద్యశాలలో చేర్పించాలని కూడా చూశారు. ఎటువంటి లాభం లేకపోయింది. దీంతో విసుగు చెందిన వీధి ప్రజలు ఎంతోమంది అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి, కోర్టుకు అప్పగించారు. కోర్టు అతడికి మూడున్నర సంవత్సరాల జైలుశిక్ష  విధించింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు