రోజూ తప్పు చేస్తూనే.. 70 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు..!

29 Jan, 2022 19:36 IST|Sakshi

లండన్‌: ట్రాఫిక్‌ రూల్స్‌ గురించి ప్రత్యేకంగా గురించి చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికే వచ్చేస్తున్న రోజులు.  చలానా మనకు  వచ్చే కొన్ని సందర్భా‍ల్లో మనం ఫలానా చోట ట్రాఫిక్‌ నిబంధన ఉల్లంఘించామా అనుకోవడం ఒక్కటే మనవంతు అవుతుంది. కాకపోతే ఒక వ్యక్తి మోటర్‌ వెహికల్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 70 ఏళ్లు తిరిగేశాడు. 

అది కూడా బ్రిటన్‌లో.  తాజాగా నాటింగ్‌హామ్‌లో సదరు వ్యక్తి పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం తెలిసింది. తాను 70 ఏళ్లుగా లైసెన్స్‌, కారుకు బీమా లేకుండా తిరుగుతున్నానని అతనే వెల్లడించాడు. ఇన్నాళ్లూ తన కారును ఏ ట్రాఫిక్‌ పోలీసు ఆపలేదని, అందుకు తనకు వాటి అవసరం లేకుండా పోయిందని తన మాటల ద్వారానే వ్యక్తపరిచాడు. 

1938లో జన్మించిన ఈ కారు డ్రైవర్ తనకు 12 ఏళ్ల నుంచి లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడని పోలీసులకు చెప్పాడు.  ఇన్నాళ్ల తన కెరీర్‌లో తనను ఎప్పుడూ పోలీసులు అడ్డుకోలేదని చెప్పాడు. ఆ వ్యక్తి నడిపి కారు కూడా ఎప్పుడూ యాక్సిడెంట్‌ కూడా కాలేదట. దాంతోనే సుదీర్ఘకాలం ఇలా రోడ్డుపై హాయిగా తిరిగేశాడు. అతనికి 12 ఏళ్ల వయసు నుంచే కారుకు బీమా లేకుండా లైసెన్స్‌ లేకుండా తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు.  

ఈ ఘటనపై బుల్‌వెల్, రైజ్‌పార్క్ హైబరీ వేల్ పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఆ సమయంలో ఆ వ్యక్తి ఓ పాత తుప్పు పట్టిన కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా గుర్తించారు. వెంటనే ఆ కారు నడిపే వ్యక్తిని అడ్డుకున్నారు. తర్వాత విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు పోలీసులు.

మరిన్ని వార్తలు