గుండెపోటు నాటకంతో 20 రెస్టారెంట్లకు టోకరా: చివరికి ఏమైందంటే...?

19 Oct, 2023 15:12 IST|Sakshi

రెస్టారెంట్‌  బిల్లు ఎగ్గొట్టేందుకు  గుండె పోటు డ్రామాలు ఆడడం అలవాటుగా మార్చుకున్నాడో ప్రబుద్ధుడు.  ఇలా ఒకటీ, రెండూ కాదు  ఏకంగా 20 రెస్టారెంట్లలో ఇదే తంతు కొనసాగించాడు. కానీ మోసం ఎల్లకాలం సాగదు కదా. ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు.   ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పెయిన్‌లో  ఈ ఘటన చోటు చేసుకుంది.

డైలీ లౌడ్ ప్రకారం ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లడం, కడుపునిండా లాగించేయడం ఆనక మూర్ఛపోయినట్టు నటించి, గుండె నొప్పి అంటూ నైలపై దొర్లి దొర్లి హడావిడి చేయడం ఇదీ ఇతగాడి తంతు. స్పెయిన్‌లోని బ్లాంకా ప్రాంతంలోని  స్థానిక రెస్టారెంట్‌లలో ఫ్యాన్సీ డిన్నర్ తింటాడు. సరిగ్గా బిల్లు కట్టే సమయానికి గుండెపోటు అంటూ భయంకరమైన డ్రామాకు తెర తీస్తాడు. ఇతగాడి నాటకాన్ని పసిగట్టిన సిబ్బంది అప్రమత్తమై, ఈ కేటుగాడి ఫోటోను ఆ ప్రాంతంలోని అన్ని  రెస్టారెంట్లకు  పంపించి వారిని కూడా అలర్ట్‌ చేశారు.  (టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!)

దీన్ని గమనించని మనోడు ఒక లగ్జరీ రెస్టారెంట్‌లో యథావిధిగా సుష్టిగా భోంచేశాడు.  ముందుగానే అక్కడి సిబ్బంది  బిల్లు ఇచ్చారు.  దీంతో  సుమారు రూ. 3,081 బిల్లు చెక్కు ఇచ్చి వెళ్లి పోదామని చూశాడు.  పాత బిల్లు సంగతి ఏంటని నిలదీశారు. అయితే హోటల్‌ గదికి వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పాడు. సిబ్బంది అతన్ని వదిలి పెట్టలేదు. నాటకం మొదలు పెట్టాడు. గుండెనొప్పి వస్తోంది ఆంబులెన్స్‌ని పిలవాలంటూ హంగామా చేశాడు. కానీ వాళ్లు ఆంబులెన్స్‌కు  బదులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతగాడి మోసానికి చెక్‌ పడింది.  అతని ఫోటోను అన్ని రెస్టారెంట్‌లకు పంపి, అరెస్ట్‌ చేయించామని స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మీడియాకు  తెలిపారు. గత ఏడాది నవంబరు 22 నుంచి ఈ  వ్యక్తి ఈ నగరంలోనే ఉంటున్నాడట. (భీకర పోరు: సాహో ఇండియన్‌ సూపర్‌ విమెన్‌, వైరల్‌ వీడియో)

మరిన్ని వార్తలు