కారుతో ఢీకొట్టి చోరీకి పాల్పడిన దుండగులు.. వీడియో వైరల్‌!

25 Jul, 2022 12:52 IST|Sakshi

వాషింగ్టన్‌: డబ్బుల కోసం కొందరు దండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో చోరీలకు పాల్పడుతూ అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనే అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగింది. ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి రక్తపు మడుగులో పడిపోయిన అతడికి చెందిన ఆభరణాలు, డబ్బులు లాక్కెళ్లారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్నాడు.

ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని న్యూయార్క్‌ పోలీస్‌ విభాగం(ఎన్‌వైపీడీ) ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. నగరంలోని బ్రోంక్స్‌లో గత శనివారం ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. ‘ఓ 39 ఏళ్ల వ్యక్తిని కొందరు దుండగులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత బలవంతంగా అతడి వస్తువులు, డబ్బులను లాక్కెళ్లారు.’ అని పేర్కొంది ఎన్‌వైపీడీ. ఈ వీడియోలో.. బ్లాక్‌ సెడాన్‌ కారు బాధితుడిని వెనకనుంచి ఢీకొట్టింది. దాంతో రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోయాడు. కొద్ది క్షణాల్లోనే కారులోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు బాధితుడి వద్ద నుంచి వస్తువులు లాక్కెళ్లారు. 

సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర విభాగం బృందాలు బాధితుడిని హుటాహుటిన లిన్‌కోల్న్‌ ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు కారు దిగి చోరీకి పాల్పడగా మరో వ్యక్తి కారులో ఉన్నట్లు చెప్పారు. దుండగుల గురించి సమాచారం తెలిసినవారు తమకు ఫోన్‌ చేయాలని, ఆన్‌లైన్‌లో సమాచారం అందించాలని కోరారు.

ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి!

మరిన్ని వార్తలు