ఇదేం ఖర్మరా బాబూ.. ఆ తిక్కకు ఓ లెక్కంటూ లేదా?

31 Dec, 2022 21:25 IST|Sakshi

వైరల్‌: పుర్రెకో బుద్ధి, జిహ్వ‌కో రుచి. వెరైటీ పేరిట చేసే ప్రయత్నాలు ఒక్కోసారి విపరీతమైన ఆదరణ తెచ్చిపెడుతుంటాయి. కానీ, ఆ ప్రయత్నం అతిగా ముందుకెళ్తే? మనిషికి తిక్క ఉండొచ్చు. కానీ, దానికి ఓ లెక్కంటూ లేకపోతేనే సమస్య మొదలయ్యేది.. 

ఈ తిక్కకు ఓ లెక్కంటూ లేదా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. జపాన్‌లో ఆ మధ్య ఒకడు కుక్కలా బతకాలని ఉందంటూ లక్షలు పోసి.. కుక్క కాస్టూమ్‌ను తయారు చేయించుకున్నాడు. రాత్రికి రాత్రే వైరల్‌ అయిపోయాడు. అయితే.. ఈ మధ్య ఓ బ్రిటన్‌ టాబ్లాయిడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోకో అనే ఆ వ్యక్తి..  కుక్కలా బతకడం వల్ల ఇంట్లోవాళ్లు, స్నేహితులు ఏం అనుకుంటారో అని తెగ ఫీలైపోతున్నాడు. త్వరలోనే ఆ వేషానికి ముగింపు వేయాలని అనుకుంటున్నాడట. ఈ వ్యవహారం మరిచిపోక ముందే.. 

అదే జపాన్‌లో మరొకడు తోడేలులా కనిపించేందుకు డబ్బు కుమ్మరించాడు. ఈసారి ఇంకా ఎక్కువే ఖర్చు చేశాడు. మన కరెన్సీలో ఆ విలువ రూ. 19 లక్షల దాకా ఉంటుంది. కుక్క కోసం టోకో ఆశ్రయించిన జెప్పెట్‌ కంపెనీనే.. ఇతని కోసం సూట్‌ తయారు చేసింది. 

అయితే నిజమైన తోడేలులాగా నడిచేందుకు అతనికి కాస్త కష్టంగా ఉందంట. అందుకే రెండు కాళ్లతో నడుస్తూ.. తన తోడేలు కల నెరవేరిందని సంతోషిస్తున్నాడు. ఇది చూసి నెటిజన్స్‌.. ఒకరిని చూసి మరొకరు ఇలా తయారు అవుతున్నారంటూ నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆ కంపెనీకి మరిన్ని జంతువుల ముసుగులు కావాలంటూ ఆర్డర్‌లు పెడుతున్నారంట ఇదంతా చూస్తున్న వాళ్లు.

A post shared by 特殊造型ゼペット (@zeppet_jp)

మరిన్ని వార్తలు