జనానికి రూ.278 కోట్లు టోకరా.. రూ 36 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశం.. నేరస్తుని స్కెచ్‌ ఇదే!

31 May, 2023 12:16 IST|Sakshi

తాను ఒక క్రూజ్‌షిప్‌ కెప్టెన్‌ అని చెప్పుకుంటూ జనాల నుంచి ఏకంగా రూ.2.78 కోట్ల సొమ్ము కాజేసిన వ్యక్తికి కేవలం రూ. 36 వేలు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చిన వింత ఉదంతం సంచలనంగా మారింది. ఆ మోసగాని పేరు జాడీ ఆలివర్‌. అతను చాలామందిని కలిసి, ఎవరికైనా సరే షిప్పులో సెలవులు ఆనందంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తానంటూ వారి నుంచి డబ్బులు గుంజేవాడు.

సదరు మోసగాడు షిప్పు కెప్టెన్‌ తరహా దుస్తులు ధరించి తిరుగుతుండేవాడు. అందరికీ నకిలీ ఐడీ కార్డు చూపించి ప్రలోభపెట్టేవాడు. మిర్రర్‌ యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఆ మోసగాడు నకిలీ అకౌంట్‌ ద్వారా జనాలకు ఈ మెయిల్స్‌ పంపించి, తాను కార్నివాల్‌ పీఎల్‌సీ ఉద్యోగిని అని చెప్పుకునేవాడు. కోర్టు విచారణ నేపధ్యంలో..మోసగాడు జనానికి ఒక షీటు పంపేవాడని, దానిలో ట్రిప్స్‌కు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఉంటాయని వెల్లడయ్యింది.

ఈవిధంగా అతను సేకరించిన మొత్తాన్ని ఆన్‌లైన్‌ జూదానికి వినియోగించేవాడు.  ఆన్‌లైన్‌ జూదం కోసం రుణాలు కూడా తీసుకునేవాడు. అయితే ఇప్పుడు అతని దగ్గర బాధితులకు ఇచ్చేందుకు కేవలం రూ.36 వేలు మాత్రమే ఉన్నాయి. బాధితులలో చాలామంది తాము దాచుకున్న మొత్తాన్ని ఆలివర్‌ చేతిలో పెట్టారు. జీవితంలో మరచిపోలేని విధంగా సెలవులను ఆనందంగా గడపుతామనే ఉద్దేశంలో అతనికి డబ్బులు చెల్లించారు. అతని బారిన పడినవారిలో ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్నారు. ఇవాన్స్‌ అనే ఒక బాధితుడు మాట్లాడుతూ ‘ఆలీవర్‌ దగ్గర నేను ఎంత సొమ్ము పోగొట్టుకున్నానో చెప్పుకోలేను. ఎందుకంటే ఈ విషయం ఇప్పటికీ నా కుమారునికి చెప్పలేదు. ఇలా డబ్బులు పోగొట్టుకోవడంలో నాదే పూర్తి బాధ్యత’అని అన్నారు.

మరో బాధితుడు మార్షల్‌ గోడాయీ మాట్లాడుతూ‘దీని ప్రభావం నా భార్య ఆరోగ్యం మీద పడింది. గతంలో మేము డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పోగొట్టుకున్న మొత్తం మాకెంతో విలువైనది’ అని అన్నారు. 2018లో బాధితులు ట్రిప్పు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ విషయమై పోలీసులకు తెలిసింది. బాధితులు తమ బ్యాగులతో ఎదురుచూసినప్పటికీ ఎటువంటి షిప్పు రాలేదు. ఆలీవర్‌ వారికి 2018 జనవరి 1నుంచి 2019 జనవరి 2 వరకూ ట్రిప్పు చేయిస్తానని నమ్మబలికాడు. కాగా అలీవర్‌ ఒక ప్రాంతంలో భార్యతో ఉంటూ, మరోప్రాంతంలో ప్రియురాలితో కాలం గడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆలివర్‌ చేసిన మోసాలు కోర్టులో నిర్థారణ కావడంతో కోర్టు అతనిని దోషిగా ఖరారు చేసింది. జడ్జి రిచర్డ్‌ విలియమ్స్‌ నేరస్తునికి ఆరు ఏళ్ల ఒకనెల పాటు జైలుశిక్ష విధించారు.

మరిన్ని వార్తలు