కింగ్ చార్లెస్‌ మరణంపై వ్యక్తి ట్వీట్.. బ్రిటన్ ప్రజల్లో తీవ్ర ఆందోళన..

13 Sep, 2022 13:19 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం(సెప్టెంబర్ 8న) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె అదే రోజు చనిపోతుందని ముందుగానే ఊహించాడు ఓ వ్యక్తి. ఈ ఏడాది జులైలోనే అతను ఈమేరకు ట్వీట్ చేశాడు. లోగన్ స్మిత్‌(@logan_smith526) అనే పేరుతో ఉన్న ఇతని ట్విట్టర్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని వెల్లడించాడు. బ్రిటన్‌కు అత్యధిక కాలం మహారాణిగా ఉన్నవారు సెప్టెంబర్ 8, 2022న మరణిస్తారు అని అతను ట్వీట్‌లో పేర్కొన్నాడు.

రాణి మరణించిన క్షణాల్లోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోగన్ స్మిత్ ట్వీట్‌ను వేలమంది రీట్వీట్ చేశారు. అయితే అతడు తన ట్వీట్‌లో రాణి మరణించే తేదీతో పాటు కొత్త రాజు ఎప్పుడు చనిపోతాడనే విషయాన్ని కూడా చెప్పడం బ్రిటన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కింగ్ చార్లెస్ 2026 మార్చి 28న మరణిస్తారని అతడు అంచనావేయడమే ఇందుకు కారణం. ఈ ట్వీట్‌ను ట్విట్టర్‌లో ఎక్కువమంది రీట్వీట్ చేస్తుండటంతో లోగన్ స్మిత్ తన ఖాతాను ప్రైవేటుగా మార్చుకున్నాడు. దీంతో అతని పాత ట్వీట్లు సాధారణ యూజర్లకు కన్పించడంలేదు.

అయితే పాత ట్వీట్ స్క్రీన్ షాట్లనే చాలా మంది యూజర్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. మరికొందరు లోగన్ స్మిత్ ప్రెడిక్షన్‌ చూసి షాక్‌కు గురవుతున్నారు. ఓ యూజర్ అయితే లోగన్‌ నువ్వు జాగ్రత్త.. బ్రిటిష్ ప్రజలు నీకోసం వస్తారు అని హెచ్చరించాడు. మరో యూజర్ స్పందిస్తూ ఇప్పటికే రాణి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాం, అలా చెప్పొద్దు అని రాసుకొచ్చాడు.

మరొక యూజర్ స్పందిస్తూ.. కింగ్ చార్లెస్ 2026లో చనిపోతారనే అంచనా కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో నిర్ణయించేది ఆ భగవంతుడే అని రాసుకొచ్చాడు. ఎలిజబెత్ 2 మరణానంతరం ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ 3 వారసుడిగా బాధ్యతలు చేపట్టారు.
చదవండి: బ్రిటన్‌ పార్లమెంట్‌లో కింగ్‌ చార్లెస్‌–3 తొలి ప్రసంగం

మరిన్ని వార్తలు