నకిలీ చెక్కుతో లగ్జరీ కారు కొని..

5 Aug, 2020 14:50 IST|Sakshi

పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ

వాషింగ్టన్‌ : రూ కోటి విలువైన పోర్షే లగ్జరీ కారును నకిలీ చెక్‌తో కొనుగోలు చేసిన వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన వెలుగుచూసింది. తన ఇంట్లోని కంప్యూటర్‌లో ప్రింట్‌ చేసిన చెక్‌తో పోర్షే కారును కొనుగోలు చేయడంతో పాటు రోలెక్స్‌ వాచీలను నకిలీ చెక్‌లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ గతవారం కాసీ విలియం కెల్లీ (42) పట్టుబడ్డాడు. వాల్టన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం కెల్లీ  డెస్టిన్‌లోని పోర్షే డీలర్‌షిప్‌ వద్ద జులై 27న 1,39,203 డాలర్ల నకిలీ చెక్‌ను ఇచ్చి దర్జాగా పోర్షే 911 టర్బోను తీసుకువెళ్లాడు. ఆయన ఇచ్చిన చెక్‌ చెల్లకపోవడంతో డీలర్‌ ఒకలూసా కౌంటీ షెరీఫ్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

చెల్లని చెక్కు ఇచ్చి పోర్షే కారులో చెక్కేసిన కెల్లీ ఆ కారుతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. అదే కారులో మిరమర్‌ బీచ్‌లో ఓ నగల దుకాణానికి వెళ్లి 61,521 డాలర్లకు మరో నకిలీ చెక్‌ ఇచ్చి మూడు రోలెక్స్‌ వాచీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే చెక్‌ నగదుగా మారే వరకూ వాచ్‌లను జ్యూవెలర్‌ తన వద్దే ఉంచుకున్నారు. చెక్‌ చెల్లకపోవడంతో జ్యూవెలర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ చెక్‌లతో మోసగించిన కెల్లీని పోలీసులు అరెస్ట్‌ చేయగా తన ఇంట్లో కంప్యూటర్‌ నుంచి ఈ చెక్కులను ప్రింట్‌ చేశానని అంగీకరించాడు. కెల్లీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని వాల్టన్‌ కౌంటీ జైలుకు తరలించారు. చదవండి : పోర్షే కయన్‌ కూపే @ 1.32 కోట్లు

మరిన్ని వార్తలు