వినూత్న ఉద్యోగ ప్రయత్నం.. ఉద్యోగం కావాలంటూ హోర్డింగ్‌ ఏర్పాటు, అయినా..?

4 Sep, 2021 16:20 IST|Sakshi

డబ్లిన్‌: ఐర్లాండ్‌కు చెందిన క్రిస్‌ హార్కిన్‌ అనే నిరుద్యోగి.. తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ వినూత్నంగా అభ్యర్ధించిన ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన 24 ఏళ్ల క్రిస్‌ 2019 సెప్టెంబర్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. నాటి నుంచి వందల సంఖ్యలో ఇంటర్వ్యూలకు వెళ్లిన క్రిస్‌కు అన్నీ చోట్ల మొండిచెయ్యే ఎదురైంది. దీంతో విసుగెత్తిపోయిన క్రిస్‌.. ఇలా అయితే కాదని వినూత్నంగా ఉద్యోగ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. 400 డాలర్లు ఖర్చు పెట్టి ఓ ప్రాంతంలో హోర్డింగ్‌ ఏర్పాటు చేయించాడు.

ఆ హోర్డింగ్‌పై ప్లీజ్‌ హైర్‌ మీ అని పెద్ద అక్షరాలతో రాయించి దాని కింద తన అర్హతలు, తన ఫోటో, వ్యక్తిగత వివరాలు, తాను ఏ రంగంలో ఉద్యోగం ఆశిస్తున్నాడో వాటి వివరాలు పొందుపరిచాడు. ఇంతటితో ఆగని క్రిస్‌.. ఎలాగైనా ఉద్యోగం రాకపోదా అని, ఈ తతంగం మొత్తాన్ని యూట్యూబ్‌లో కూడా పోస్ట్‌ చేశాడు. కానీ, ఇంత చేశాక కూడా క్రిస్‌కు ఉద్యోగం రాలేదు. ఇలా దాదాపు 2 వారాలు వేచి చూసిన క్రిస్‌.. ఏ ఉపయోగం లేకపోవడంతో తన వినూత్న ఉద్యోగ ప్రయత్నానికి స్వస్థి పలికాడు. బిల్‌ బోర్డు(హోర్డింగ్‌) ఖర్చు భరించే స్తోమత లేకే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. కాగా, క్రిస్‌కు ఈ ఐడియాను సోషల్ మీడియా మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరి ఇచ్చిందట.
చదవండి: Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే..

మరిన్ని వార్తలు