చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి ఇచ్చారని.. రెస్టారెంట్‌కు నిప్పుపెట్టిన మందుబాబు..

19 Oct, 2022 20:54 IST|Sakshi

వాషింగ్టన్‌: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి తెచ్చి ఇచ్చారని ఆగ్రహంతో రెస్టారెంట్‌కు నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి. బకెట్‌ పెట్రోల్ పోసీ తగలబెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో విధ్వంసం సృష్టించిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా అతడు నేరాన్ని అంగీకరించాడు.

అమెరికా న్యూయార్క్‌ క్వీన్స్‌లోని ఓ బంగ్లాదేశీ రెస్టారెంట్‌లో అక్టోబర్‌ 14న ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని చాఫెల్‌గా గుర్తించారు అధికారులు. సీసీటీవీ ఆధారంగా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ వీడియోలో రెస్టారెంట్‌కు నిప్పంటించిన తీరుపై కొందరు నెటిజన్లు జోకులు పేల్చారు. రెస్టారెంట్‌ ఎంట్రెన్స్ దగ్గర పెట్రోల్ పోసిన నిందితుడు అది తన చుట్టూ వ్యాపించి ఉందనే సోయి కూడా లేకుండా నిప్పంటించాడు. దీంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. షూస్ మాత్రం పాక్షికంగా కాలిపోయాయి. తగలబెట్టడం కూడా తెలియని ఇలాంటి వాడితో సమాజానికి నిరూపయోగం అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..!

మరిన్ని వార్తలు