ఇలాగయితే కరోనా రాదా..?

22 Sep, 2020 19:26 IST|Sakshi
ఫొటో కర్టసీ (డైలీ మెయిల్‌)

లండన్‌ : బ్రిటన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగి పోతుండడంతో మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నిర్ణయించారు. ఇది వరకటిలా సంపూర్ణ లాక్‌డౌన్‌ కాకుండా పాక్షిక లాక్‌డౌన్‌ కింద గురువారం నుంచి రాత్రి పది గంటలకల్లా రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయని తెలిసి బ్రిటన్‌లోని పలు నగరాల్లో క్లబ్బులు, పబ్బులు కిక్కిరిసి పోవడమే కాకుండా యువతీ, యువకులు పీకల దాకా తాగి రోడ్లపైనే మత్తుగా పడిపోయారు.

ఇదిలావుండగా, మాన్‌చెస్టర్‌ నగరంలోని ఓ పబ్‌లో బీరు తాగుతూ మాట్లాడుతున్న ఓ మధ్య వయస్కుడి నోటి నుంచి తుంపర్ల జల్లు కురవడం కనిపించింది. దాన్ని ఎవరో వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా, దాన్ని లక్షలాది మంది చూస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగి పోయాక రాత్రి పది గంటల నుంచి ఆంక్షలు విధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుందని కొందరు వీడియో వీక్షకులు ప్రశ్నించగా, ఇలా తుంపర్లు చిమ్ముతూ మాట్లాడే వ్యక్తులుంటే ఏ ఆంక్షలు అమలు చేసి ఏం లాభమని కొందరు వ్యాఖ్యానించారు.

తుంపర్ల జల్లు కురిపించిన వ్యక్తికి గనుక నిజంగా కరోనా వైరస్‌ ఉన్నట్లయితే ఈ పాటికి ఆ పబ్‌కు వచ్చిన కస్టమర్లందరికి ఆ వైరస్‌ సోకే ఉంటుందని వ్యాఖ్యానించిన వారూ ఉన్నారు.

చదవండి: చైనాలో మరో ‘అద్భుతం’.. అదేంటో తెలుసా?

మరిన్ని వార్తలు