2021 Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి వీరికే..

8 Oct, 2021 15:05 IST|Sakshi

ఓస్లో: ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్‌ శాంతి పురస్కారానికి ఈ ఏడాది(2021) మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ కు ఎంపికయ్యారు. నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ నేడు శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ వీరిని ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్‌ కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని నోబెల్‌ కమిటీ కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది.  (చదవండి: రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్‌ బహుమతి విజేతలు వీరే..!)

దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్, నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి రష్యా దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో అతని మీద అనేక దాడులు చేయడమే బెదిరింపులు కూడా వచ్చాయి. పత్రికా స్వేచ్ఛను రక్షించడంలో చూపించిన ధైర్యసాహసాలకు మురాటోవ్ కు 2007లో సీపీజె అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డును గెలుచుకున్నాడు.

మరియా రెస్సా ఫిలిప్పినో-అమెరికన్ జర్నలిస్ట్. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్‌’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్‌ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు. ఆగ్నేయ ఆసియాలో సీఎన్ఎన్ పరిశోధనాత్మక రిపోర్టర్ గా దాదాపు రెండు దశాబ్దాలు పనిచేశారు.

మరిన్ని వార్తలు