Mars: మార్స్‌ మీద మంచు.. ఇసుక

30 Mar, 2021 19:08 IST|Sakshi

ఇసుక తిన్నెల్లో మంచుతో ఫొటో బాగుంది కదూ.. ఎక్కడిదీ ఫొటో తెలుసా? ఆ.. ఏముందీ.. ఏదో ఓ ఎడారిలో తీసి ఉంటారు అనుకుంటున్నారా.. కాదు.. ఇది ఎడారిలోనో, ఆ చుట్టూ ఉన్న ఏదో ఓ దేశంలోనో తీసిన ఫొటో కాదు. అసలు భూమి మీద ఏ ప్రాంతం కూడా కాదు.. మనకు కోట్ల కిలోమీటర్ల దూ రంలో ఉన్న అంగారక గ్రహం (మార్స్‌) మీద తీసిన ఫొటో ఇది. అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ‘మార్స్‌ ఆర్బిటార్‌’ శాటిలైట్‌ తీసిన ఫొటో ఇది. మార్స్‌ మీద ఉన్న ఓ పేద్ద బిలంలో ఉన్న ఇసుక తిన్నెలను ‘మార్స్‌ ఆర్బిటార్‌’కు అమర్చిన హైరైజ్‌ కెమెరాతో చిత్రీకరించారు. 

సౌర కుటుంబంలో మన భూమి మాత్రమేనా.. మరో గ్రహం మీద మనిషి బతకగలడా.. అంతరిక్ష శాస్త్రవేత్తల్లో చాలా మందిని తొలిచేస్తున్న ప్రశ్నలివి. శాస్త్రవేత్తలకే కాదు చాలా మంది సాధారణ జనానికీ ఇదే ఆసక్తి. అందుకే భూమితో పోలిస్తే దగ్గరి పోలికలు ఉండే అంగారకుడిపై శాస్త్రవేత్తలు ఏనాడో దృష్టి పెట్టారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా చాలా దేశాలు మార్స్‌ దగ్గరికి శాటిలైట్లను, ఆర్బిటర్లను పంపాయి.

అలా నాసా పంపిన ‘మార్స్‌ ఆర్బిటర్‌’ అంగారకుడికి సంబంధించిన ఎన్నో రహస్యాలను గుర్తించింది. ఈ క్రమంలోనే తాజాగా ఫొటోలు పంపింది. ఆ ఫొటోలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై మంచు ఏర్పడుతూ, అప్పుడప్పుడూ కరిగి ప్రవహిస్తోందని గుర్తించారు. అందుకే కాలువల్లాంటి నిర్మాణాలు ఏర్పడినట్టు తేల్చారు.   

ఇక్కడ చదవండి: 
మార్స్‌పై తొలి నగరం ఇలా ఉంటుందా..!

మార్స్ సంచలన నిజాలు బయటపెట్టిన నాసా...!

మరిన్ని వార్తలు