Who Is Ahmad Massoud: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్‌ హీరో ఇతడే..!

21 Aug, 2021 20:29 IST|Sakshi

Ahmad Massoud History In Telugu: తాలిబన్లు.. రాక్షసత్వానికి మారు పేరు. వాళ్ల పేరు చెబితే అఫ్గాన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెన్నులో వణుకు పుడుతుంది. తాలిబన్ల అరాచకాలు ఒకటా..? రెండా..? ఎన్నో ఎన్నెనో..! అయితే తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న ప్రాంతం పంజ్‌షిర్. ఒకప్పుడు అక్కడ గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడే అహ్మద్‌ షా మసూద్‌‌. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు. కానీ ఆయన నాటిన విత్తనాలు పంజ్‌షిర్‌ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఆయన కొడుకు అహ్మద్ మసూద్‌ ప్రపంచ దేశాల మద్దతుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

కాబూల్‌: అహ్మద్ షా మసూద్‌ కొడుకు అహ్మద్‌ మసూద్(32) తన బలమైన కోటైన పంజ్‌షిర్‌ లోయ నుంచి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం అఫ్గాన్‌ మిలిటరీ సభ్యులు, కొంతమంది ప్రత్యేక దళ సభ్యులతో కలిసి పోరాడనున్నట్లు మసూద్‌ తెలిపారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గుర్తించి తన తండ్రి ఉన్నప్పుడే మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను భద్రపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తాలిబన్లు తమ పై దాడి చేస్తే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరించారు.

అయితే పాశ్చాత్య దేశాల సహాయం లేకుండా తమ దళాలు నిలవలేవని, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చి, అవసరమైన వాటిని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య కేవలం అఫ్గాన్‌ ప్రజలది మాత్రమే కాదన్నారు. తాలిబన్ల నియంత్రణలో నిస్సందేహంగా అఫ్గాన్‌లో పెను విధ్వంసం సృష్టిస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యాలకు వ్యతిరేకంగా మరోసారి బాటలు పరుస్తుందని అహ్మద్‌ మసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అసలు అహ్మద్‌ షా మసూద్ ఎవరు?
హిందూకుష్‌ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్‌ ప్రావిన్స్‌ ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్‌ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షిర్‌ ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. అక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని మరింతగా నింపిన నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌. ఆయన మార్గదర్శకత్వంలో పంజ్‌షిర్‌ ప్రజలు తాలిబన్‌లకు వ్యతిరేకంగా పోరాడారు. 1970-80లలో సోవియట్‌ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు.. 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత పోరాటం జరిపిన యోధుల్లో అహ్మద్‌ షా పాత్ర కీలకమైనది. ఆయన కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు.. మిలటరీ కమాండర్‌ కూడా.

2001లో యూరప్‌ను సందర్శించి తాలిబన్లకు పాకిస్థాన్‌ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్‌ పాలనలో అఫ్గాన్‌ ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాగా తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ..  2001 సెప్టెంబర్‌ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 

చదవండి: Afghanistan: విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది

మరిన్ని వార్తలు