హైతీలో భారీ భూకంపం.. 724 కు చేరిన మృతుల సంఖ్య

15 Aug, 2021 07:33 IST|Sakshi

భారీ భూకంపంతో కరేబియన్‌ దేశం హైతీ ఘోరంగా వణికిపోయింది. శనివారం సంభవించిన భూకంపం దాటికి మృతుల సంఖ్య 724 కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎటుచూసినా భవనాలు కుప్పకూలి కనిపిపస్తుండడంతో క్షతగాత్రుల సంఖ్య ఊహించని రీతిలో ఉండేలా కనిపిస్తోంది. 

శనివారం హైతీలో భారీ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత 7.2గా నమోదు అయినట్లు తెలుస్తోంది. వందల్లో భవనాలు కుప్పకూలగా.. శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 304కు మృతదేహాలను సహాయక సిబ్బంది, స్థానికులు వెలికి తీశారు. రెండు వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమంగా 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే హైతీ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ సహాయక చర్యల్లోకి దిగింది. ప్రకృతి విలయంపై ప్రధాని ఏరియెల్‌ హెన్రీ దిగ్‌భ్రాంతి వ్యక్తం చేశారు. నెలపాటు దేశ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షంచాకే .. అంతర్జాతీయ సమాజ సాయం కోరతామని వెల్లడించారు. 

కాగా, 2010లో హైతీలో సంభవించిన భారీ భూకంపం కారణంగా.. మూడు లక్షల మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజా భూకంప పరిణామాల నేపథ్యంలో అమెరికా సహాయక విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా, మరింత సమాచారం అందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు