వీడియో: టోంగా దగ్గర పేలిన అగ్నిపర్వతం.. ముందుకొచ్చిన సముద్రం! సునామీ హెచ్చరికలు

15 Jan, 2022 17:08 IST|Sakshi

 పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు అలుముకున్నాయి. భారీ ప్రకంపనల కారణంగా.. సముద్ర జలాలు ముందుకు చొచ్చుకునిరాగా.. కొన్ని దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.

టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పసిఫిక్‌లో అనేక ద్వీపదేశాలు.. మహాసముద్ర అంతర్భాగంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. టోంగాకు సమీపాన అగ్నిపర్వతం హుంగా టోంగా-హుంగా హాపై హఠాత్తుగా బద్దలైంది. ది హుంగా టోంగా హాపై అగ్నిపర్వతం.. టోంగాన్‌ రాజధాని నుకువాలోఫాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. విస్ఫోటనం తాలూకు శబ్దాలు 8 నిమిషాల పాటు కొనసాగాయి. విస్ఫోటనం తీవ్రత ఎంతగా ఉందంటే, అక్కడికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల్లోనూ శబ్దాలు వినిపించాయట!. 

కాగా సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. హిమావరీ శాటిలైట్‌ చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి న్యూజిలాండ్, టోంగా, ఫిజీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల వాసులు తమ నివాసాలను వదిలి వెళ్లాలని, ఎత్తయిన ప్రదేశాలకు చేరుకోవాలని పలు దేశాల్లో అప్రమత్తం చేస్తున్నాయి. శుక్రవారం సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకున్న కొన్ని గంటలకే.. ఈ పరిణామంతో మళ్లీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. మరోవైపు కొన్ని పాత, ఫేక్‌ వీడియోలు సైతం సునామీ పేరిట వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు