ఓడిపోతే.. దేశం విడిచి వెళతానేమో!

19 Oct, 2020 04:47 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌/విస్కాన్సిన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తికాకముందే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదని సంకేతాలు అందాయో ఏమోగానీ ప్రజల తీర్పును ప్రభావితం చేయాలన్న ఆరాటం ఆయనలో కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా విడిచి వెళ్లిపోతానేమోనని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం, ఇప్పటికే భారీగా జనం మరణించడం, దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతుండడం, వర్ణ వివక్ష, తర్వాత దేశంలో వెల్లువెత్తుతున్న అశాంతి వంటివి ట్రంప్‌నకు ప్రతికూలంగా మారాయి. తాజాగా జార్జియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌ మాట్లాడారు. ‘‘నా పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ఎన్నికల్లో నెగ్గకపోతే ఏం చేస్తానో మీరు ఊహించ గలరా? బహుశా దేశం విడిచి వెళ్లిపోతానేమో! నాకు తెలియదు’’అని అన్నారు.

బైడెన్‌ వస్తే వ్యాక్సిన్‌ మరింత ఆలస్యం
డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గనుక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే కరోనా వ్యాక్సిన్‌ రాకను మరింత ఆలస్యం చేస్తారని, వైరస్‌ వ్యాప్తిని మరింత పెంచుతారని ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దేశ ప్రజలను హెచ్చరించారు. శనివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. బైడెన్‌ అధ్యక్షుడైతే అమెరికాను మూసివేస్తాడని చెప్పారు. ప్రతిపక్షాలు అమెరికన్ల జీవన విధానాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.  బైడెన్‌ దేశ ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ట్రంప్‌ నెగ్గడానికి మిషిగాన్, విస్కాన్సిన్‌ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయన్న వాదన ఉంది. ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన బలం తగ్గిందని, జో బైడెన్‌కు అనుకూల పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. త్వరలోనే మిషిగాన్, విస్కాన్సిన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు