గుండెను బ్యాగులో పెట్టుకొని తిరుగుతోంది!

19 Apr, 2021 18:42 IST|Sakshi

లండన్‌: సాధారణంగా మీరేప్పుడైనా బయటకు వెళ్తే.. బ్యాగులో ఏం పెట్టుకుంటారు? మహా అయితే.. ఏ చిన్నవస్తువులో లేదా ల్యాప్‌టాప్‌లో​ ఉంటాయి. అయితే, యూకేకు చెందిన ఈ మహిళ మాత్రం బయటకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా ఆమెతో ఒక బ్యాగు, దానిలో ఆమె గుండె ఉంటుంది. ఏంటీ నమ్మట్లేదా.. అయితే చదివేయండి. ఆ మహిళ పేరు సెల్వా హుస్సెన్‌. ఆమె 2017లో కారు నడుపుతూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్‌లు గుండె ఫెయిలయ్యిందని, వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్‌ కావాలని సూచించారు.

అప్పుడు సెల్వాను హుటాహుటీనా హేర్ఫీల్డ్ గుండె ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు నాలుగు రోజులపాటు చికిత్స అందించారు. అప్పటికి ఆమె శ్వాసతీసుకోలేక పోయింది. ఇక చేసేదేమిలేక , కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమెకు కృత్రిమ గుండెను అమర్చారు. ఇది పనిచేయడానికి ప్రత్యేక  కంట్రోల్ యూనిట్‌ను ఆమె వెనుక ఏర్పాటు చేశారు. అంతే కాకుండా,  మరో యూనిట్‌ను ఆమె వెనుక బ్యాగ్‌లో కూడా అమర్చారు. ఇవి రెండు కూడా ఆమె గుండె సమర్థవంతంగా పనిచేయాడానికి ఉపయోగపడుతుంది.

ఎప్పుడైనా, మొదటి యూనిట్‌ పనిచేయకపోతే.. రెండో యూనిట్‌ దాని స్థానంలో పనిచేస్తుంది. ఆమె బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఒకరి తోడుండాల్సిందే. ఈ కృత్రిమ గుండె ఆమె శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతోంది. ఆమె కడుపు నుంచి ప్రత్యేక పైపులు.. బ్యాక్‌ప్యాక్‌లోని మొదటి యూనిట్‌కు, రెండో యూనిట్‌కు కలుపబడి ఉన్నాయి. దీనితో శరీరంలోనికి రక్తం పంపింగ్‌ చేయబడుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి వ్యాధి ఉంటుందని డాక్టర్లు తెలిపారు.

దీన్ని వైద్యపరిభాషలో కార్డియోమయోపతి అంటారని తెలిపారు. కాగా, ఈ కృత్రిమ గుండె ఖరీదు  86 వేల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.88.72 లక్షలు). దీన్ని ఓ అమెరికాకు చెందిన సంస్థ తయారు చేసింది. ఈ గుండెను అమర్చేందుకు హేర్ఫీల్డ్ ఆసుపత్రి వైద్యులు దాదాపు 6 గంటలపాటు శ్రమించారు. 

మరిన్ని వార్తలు