ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

9 Mar, 2021 04:02 IST|Sakshi

రాజకుటుంబంలో ఒంటరితనం అనుభవించా

వివక్షను ఎదుర్కొన్నా; నా బిడ్డ రంగు గురించి చర్చించారు

నా వల్ల కేట్‌ ఏడవలేదు; నేనే తన వల్ల కన్నీరు పెట్టుకున్నా

ఓప్రా విన్‌ఫ్రే టాక్‌ షోలో సంచలన విషయాలు వెల్లడించిన బ్రిటన్‌ ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌

లాస్‌ ఏంజెలిస్‌/లండన్‌: ప్రిన్స్‌ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్‌ రాచకుటుంబంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలను అనుభవించానని ఆఫ్రికన్‌ అమెరికన్‌ నటి మేఘన్‌ మార్కెల్‌ వెల్లడించారు. చాలా ఒంటరితనం అనుభవించానని, తన మానసిక వేదనకు పరిష్కారం లేదనిపించిందని, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించానని వెల్లడించారు. ఇక జీవించాలనుకోవడం లేదని హ్యారీతో కూడా చెప్పానన్నారు. ఈ విషయంలో వైద్య సహాయం పొందేందుకు కూడా అవకాశం కల్పించలేదని, దానివల్ల రాజకుటుంబ పరువుప్రతిష్టలకు భంగం కలుగుతుందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చాట్‌ షోలో పలు సంచలన విషయాలను ఆమె ప్రఖ్యాత అమెరికన్‌ టీవీ హోస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రేతో పంచుకున్నారు.

అమెరికాలో సీబీఎస్‌ నెట్‌వర్క్‌ చానల్‌లో ఆదివారం ఆ కార్యక్రమం ప్రసారమైంది. కుటుంబంతో విభేదాల కారణంగా గత సంవత్సరం మార్చిలో ప్రిన్స్‌ హ్యారీ దంపతులు, తమ ఏడాది కుమారుడు ఆర్చీతో కలిసి రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. ఓప్రా విన్‌ఫ్రే కార్యక్రమంలో మేఘన్‌ భర్త ప్రిన్స్‌ హ్యారీ కూడా పాల్గొని, పలు రాచకుటుంబ రహస్యాలను వెల్లడించారు. వివాహం తరువాత కొత్తగా రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు కొద్ది రోజుల తరువాత ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయని మేఘన్‌ తెలిపారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఊహించని స్థాయిలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానన్నారు.

నలుపురంగులో పుడితే ఎలా..?
‘పుట్టబోయే చిన్నారి రంగు గురించి రాచకుటుంబం మాట్లాడుకుంది. నేను నలుపు కనుక బిడ్డ కూడా నలుపు రంగులోనే పుడితే ఎలా?’అని వారు ఆలోచించారని తెలిపారు. పుట్టబోయే బిడ్డకు రాజకుటుంబం నుంచి లభించే ‘ప్రిన్స్‌’హోదా ఇవ్వకూడదని నిర్ణయించారని, అందువల్ల రాజకుటుంబ సభ్యులకు లభించే భద్రత కూడా అందదని తేల్చేశారని వివరించారు. ఈ విషయాలను హ్యారీ తనతో పంచుకున్నారని, వాటిని జీర్ణించుకోవడం తమకు కొన్నాళ్ల పాటు సాధ్యం కాలేదని తెలిపారు. అయితే, బిడ్డ రంగు గురించిన వ్యాఖ్యలు ఎవరు చేశారన్న విషయాన్ని మేఘన్‌ వెల్లడించలేదు. వారి పేరు చెబితే.. వారి ప్రతిష్టకు భారీగా భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

ఆ విషయమై తనతో రాజకుటుంబ సభ్యులు జరిపిన సంభాషణను తాను కూడా బయట పెట్టాలనుకోవడం లేదని హ్యారీ కూడా స్పష్టం చేశారు. కుటుంబం నుంచి దూరంగా వచ్చేసిన తరువాత తన ఫోన్‌ కాల్స్‌ను కూడా తన తండ్రి ప్రిన్స్‌ చార్లెస్‌ స్వీకరించలేదని హ్యారీ తెలిపారు. అంతకుముందు, నానమ్మ ఎలిజబెత్‌ రాణితో మూడు సార్లు, తండ్రి ప్రిన్స్‌ చార్లెస్‌తో రెండు సార్లు మాత్రం మాట్లాడానన్నారు. ‘నా కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమే. కానీ తప్పదు. నేను, నా భార్య మేఘన్, కుమారుడు ఆర్చీల మానసిక ఆరోగ్యం కోసం రాజ కుటుంబానికి దూరం కావాలన్న నిర్ణయం తీసుకున్నాను’అని హ్యారీ వివరించారు.  

అవన్నీ అవాస్తవాలు..
బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయిందని హ్యారీ వివరించారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్‌ డయానా తన కోసం దాచిన ఆస్తులే తమను ఆదుకున్నాయన్నారు. తమ వివాహం తరువాత రాజకుటుంబం తనకు, తన భర్తకు సరైన భద్రతను కూడా కల్పించలేదని మేఘన్‌ ఆరోపించారు. రాయల్‌ వెడ్డింగ్‌ సందర్భంగా ఫ్లవర్‌ గర్ల్‌ డ్రెసెస్‌ విషయంలో తన తోటి కోడలు, ప్రిన్స్‌ విలియం భార్య, డచెస్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ కేథరిన్‌(కేట్‌) మిడిల్‌టన్‌ తన కారణంగా కన్నీళ్లు పెట్టుకున్నారన్న వార్తలను ఓప్రా విన్‌ఫ్రే ప్రస్తావించగా.. అవన్నీ అవాస్తవాలని మేఘన్‌ తెలిపారు. ‘నిజానికి జరిగింది వేరే. ఆ ఘటనతో నేనే ఏడ్చాను. ఆ తరువాత కేట్‌ నన్ను క్షమాపణలు కూడా కోరింది’అని వెల్లడించారు.

‘నిజానికి రాయల్‌ వెడ్డింగ్‌కు మూడు రోజుల ముందే మాకు వివాహం జరిగింది. అది మాకు మాత్రమే ప్రత్యేకమైన ప్రైవేట్‌ విషయం’అని మేఘన్‌ పేర్కొన్నారు. వివాహమైన మొదట్లో బాగానే చూసుకున్నారని, ఆ తరువాతే వారిలో మార్పు వచ్చిందని మేఘన్‌ వివరించారు. ‘మొదట్లో నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు’అన్నారు. ఎలిజబెత్‌ రాణితో తనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, ప్రిన్స్‌ ఫిలిప్‌ ఇటీవల అస్వస్థతకు గురైనప్పుడు ఆమెకు ఫోన్‌ చేసి మాట్లాడానని వివరించారు. ‘రాజకుటుంబ క్రియాశీల బాధ్యతల నుంచి తప్పుకుని ఎలిజబెత్‌ రాణిని బాధపెట్టారా?, ఆమెకు చెప్పకుండా ఆ నిర్ణయం తీసుకున్నారా?’అన్న ప్రశ్నకు.. ఈ విషయమై నానమ్మకు, తనకు మధ్య పలుమార్లు చర్చ జరిగిందని హ్యారీ వెల్లడించారు. నానమ్మ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు.

 

పాప పుట్టబోతోంది
రెండో సంతానంగా తమకు పాప పుట్టబోతోందని ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌లు వెల్లడించారు. ‘ఫస్ట్‌ కుమారుడు. ఇప్పుడు పాప. ఇంతకన్నా ఏం కావాలి? మేం నలుగురం. మాతో పాటు రెండు కుక్కలు. ఇదే మా కుటుంబం’అని హ్యారీ ఆనందంగా వివరించారు. టాక్‌షోలో ఓప్రా విన్‌ఫ్రే మొదట మేఘన్‌తో కాసేపు మాట్లాడిన తరువాత, వారితో హ్యారీ జతకలిశారు.

మరిన్ని వార్తలు