Meghan Markle: ఎలిజబెత్‌ కోట బయట ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చిన మేఘన్

13 Sep, 2022 18:52 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్‌సోర్ కాస్టిల్‌కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్‌, మరో మనవడు ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్‌ కలిసి ఈ కోటకు వెళ్లారు. రాణికి సంతాపం తెలిపేందుకు  వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు.

అయితే హ్యారీ భార్య మేఘన్.. కోట బయట ఏడుస్తున్న ఓ టీనేజర్‌ను ఆప్యాయంగా పలకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ బాలికతో మేఘన్ మాట్లాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఈ వీడియోలో ప్రిన్స్ హ్యారీ కోట బయట ఉన్నవారితో మాట్లాడుతుండగా.. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న అతని భార్య మేఘన్ ఓ టీనేజర్ దగ్గరకు వెళ్లింది.  ఏడుస్తున్న ఆ చిన్నారిని నీ పేరేంటని అడిగింది. అందుకు ఆ బాలిక అమెల్కా అని బదులిచ్చింది. నీపేరు చాలా బాగుందని చెప్పిన మేఘన్‌.. రాణికి నివాళులు అర్పించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. మూడు గంటలుగా వారంతా వేచి చూస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఏడుస్తున్న అమెల్కాను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి మొదట టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత అది వైరల్‌గా మారింది.

A post shared by MEMEZAR • Comedy and Culture (@memezar)

2018లో ప్రేమ పెళ్లి చేసుకున్న హ్యారీ, మేఘన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2021 మార్చి నుంచి వీరు రాజకుటుంబానికి దూరంగా అమెరికాలోని నివసిస్తున్నారు. రాణి మరణానికి ముందు అనుకోకుండా వారు బ్రిటన్‌లోనే ఉన్నారు. దీంతో కుటంబసభ్యులతో వెళ్లి రాణికి నివాళులు అర్పించారు. రాణి మరణంతో హ్యారీ, మేఘన్ మళ్లీ రాజకుటుంబానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాలు భావిస్తున్నాయి.
చదవండి: బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్‌

మరిన్ని వార్తలు