మిషెల్‌ మిమ్మల్ని ఎంత గౌరవించారు.. మీరేంటిలా?!

19 Jan, 2021 11:52 IST|Sakshi

అమెరికా ఫస్ట్‌ లేడి మెలానియా ట్రంప్‌ తీరు పట్ల నెటిజనుల ఆగ్రహం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి కాలం ముగియడానికి మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. వివాదాలు, విమర్శల విషయంలో అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు ట్రంప్‌ రికార్డును సమం చేయలేరు. ఇక అధ్యక్ష ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ట్రంప్‌ మరిన్ని వివాదాస్పద చర్యలకు పూనుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి చేయడం.. ఆ తర్వాత ట్రంప్‌పై అభిశంసన ప్రవేశపెట్టడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇక అమెరికా చరిత్రలోనే రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రమే. రేపు జో బైడెన్‌ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి తాము హాజరు కాబోవడం లేదని ఇప్పటికే ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రస్తుత ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌పై కూడా నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. వైట్‌ హౌస్‌ సంప్రదాయలను పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘మీ కన్నా ముందు అధ్యక్షుడిగా ఉన్న బరాక్‌ ఒబామా దంపతులు మీ విషయంలో ఎంత గౌరవంగా.. హుందాగా ప్రవర్తించారు.. మరి మీరేంటిలా’ అని ప్రశ్నిస్తున్నారు. (చదవండి: అమెరికాలో నల్లజాతీయుల మరణానికి కారణం ఇదే!)

నెటిజనులు మెలానియాను ఇంతటా ట్రోల్‌ చేయడానికి కారణం ఏంటంటే ఆమె భవిష్యత్ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్‌కి ఆహ్వానించలేదు. అధికార పరివర్తనలో భాగంగా ప్రస్తుత ఫస్ట్‌ లేడి.. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కన్నా ముందే భవిష్యత్‌ ఫస్ట్‌లేడీని ప్రైవేట్‌ లివింగ్‌‌ క్వార్టర్స్‌కి ఆహ్వానిస్తారు. బ్రెస్‌ ట్రూమన్‌ నుంచి మొదలైన ఈ సంప్రదాయం మిషెల్‌ ఒబామా వరకు అందరు పాటించారు. ఇక ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ తన భర్త పౌరసత్వానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికి.. మిషెల్‌ ఒబామా వాటిని మనసులో పెట్టుకోలేదు. 2016 ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించగానే అప్పటి మొదటి మహిళ మిషెల్‌ ఒబామా, తన భర్తతో కలిసి వెళ్లి మెలానియాను సాదరంగా ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం మెలానియా ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు. ఇప్పటివరకు ఆమె భవిష్యత్‌ ఫస్ట్‌ లేడి జిల్‌ బైడెన్‌ని కనీస పలకరించిన దాఖలాలు కూడా లేవు. (చదవండి: శ్యామ్‌ని చూసి.. మిషెల్‌ ముగ్ధులైపోయారు)

దాంతో నెటిజనలు మెలానియాను విమర్శిస్తున్నారు. కొందరు(ఒబామా లాంటి వాళ్లు) ఇవ్వడానికి ఉంటే.. మరికొందరు(ట్రంప్‌ ఆయన భార్య మెలానియా) లాంటి వాళ్లు తీసుకోవడానికే ఉంటారని దుయ్యబడుతున్నారు. ఇక తన ఫేర్‌వెల్‌ మెసేజ్‌లో మెలానియా అమెరికన్లు తమ ఉత్తమమైన చొరవను అనుసరించాలని.. హింస ఎన్నడూ సమాధానం కాదని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు