పుతిన్‌ VS జెలెన్‌స్కీ: వాటి వెనుక బోలెడంత కథ! ఎక్కువ మార్కులు ఎవరి కంటే..

24 Mar, 2022 21:25 IST|Sakshi

దేశం కోసం అంటూ ఒకరు, తన సరిహద్దుల్లో నాటో వద్దంటూ మరొకరు.. విరామం లేకుండా యుద్ధంలో మునిగిపోయారు. ఉన్నబలగానికి ధైర్యం ఇస్తూ ఒకరు.. బలమైన బలగాలకు అధ్యక్ష భవనం నుంచే ఆదేశిస్తూ మరొకరు మొత్తం ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేశారు. ఇక్కడ తప్పొప్పులు ఎవరివి? నష్టం ఎటువైపు ఎక్కువ ఉంటోంది అనే విషయాలను పక్కనపెడితే.. వాళ్ల ఆటిట్యూడ్‌కు సంబంధించిన విషయం ఒకటి ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. అదే వాళ్ల డ్రెస్సింగ్‌.. 

మామూలురోజుల్లో సూట్‌ బూట్‌లో సందడి చేసే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. ఈ నెలరోజుల యుద్ధంలో కనిపించిన ప్రతీసారి సాదాసీదాగా గ్రీన్‌కలర్‌ టీషర్టులో కనిపిస్తున్నాడు. తద్వారా దేశంతో సమానమైన బాధను పంచుకుంటున్నాననే సందేశాన్ని పంపిస్తున్నాడాయన. ఫ్యాషన్‌ హిస్టారియన్స్‌ అంచనా ప్రకారం.. పిరికితనానికి ఎరుపు, తెలుపు, నీలం దుస్తులను ప్రతీకగా భావిస్తారు.  

కానీ, ఒలివ్‌, గ్రీన్‌ కలర్‌ టీషర్టుల్లోనే జెలెన్‌స్కీ ఎక్కువ దర్శనమిస్తున్నాడు. ఇవి యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్న సైన్యానికి సంకేతం. కీవ్‌ నుంచి పారిపోనంటూ ఇచ్చిన ప్రకటన.. ఉక్రెయిన్‌ ప్రజల తెగువ, పోరాట పటిమకు నిదర్శనం. అందుకే ప్రపంచానికి అర్థమయ్యేలా సాదాసీదా దుస్తుల్లోనే దర్శనమిస్తున్నాడు. తన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. పలు దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. 

పుతిన్‌ సంగతికొస్తే..
రష్యా మిలిటరీ చర్య మొదలైన తర్వాత.. పోయిన వారం ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో హాజరైన పుతిన్‌ ఓ ఫ్యాషనబుల్‌ కోట్‌లో దర్శనమిచ్చాడు. ఇటలీ నుంచి దిగుమతి అయిన ఆ కోట్‌ ఖరీదు సుమారు 14 వేల డాలర్లు. అంటే.. మన కరెన్సీలో అది 10 లక్షల రూపాయలకు పైనే. తద్వారా ప్రపంచానికి తన దర్శం, యుద్ధ కాంక్షను, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని పుతిన్‌ భావించాడు. అయితే ఇక్కడే బెడిసి కొట్టిందేమో అనే చర్చ మొదలైంది?. 

ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నేతల్లో పుతిన్‌ ఒకరు. విలాసాలతో పాటు దానగుణంలోనూ ఆయనకు ఆయనే సాటి. కానీ, ఉక్రెయిన్‌ పరిణామాలు ఆ పరిస్థితుల్ని మార్చేశాయి.  రష్యా ఆర్థిక పతనం తర్వాత.. రూబుల్స్‌(కరెన్సీ)విలువ దారుణంగా పతనం అయ్యింది. దీంతో అధ్యక్షుడిగా పుతిన్‌కు అందుతున్న జీతంలోనూ కోత పడింది. పైగా రష్యా సైన్యానికి ఆర్థిక తోడ్పాటు కష్టంగా అందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ధనికదేశమనే సంకేతాలు ప్రపంచానికి పంపడం సరికాదనేది విశ్లేషకుల మాట. 


డ్రెస్సులోనే అంత ఉంది

పరిస్థితులకు తగ్గట్లు వస్త్రధారణ ఉండాలనేది కొత్త విషయం ఏం కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో..  యూకే అధ్యక్షుడు విన్‌స్టన్ చర్చిల్ సైరన్ సూట్‌ను ధరించేవాడు. వైమానిక దాడి జరిగినప్పుడు మీరు త్వరగా తప్పించుకునేందుక వీలుగా అది.

ఇక అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డీ రూజ్‌వెల్ట్‌.. మిలిటరీ దుస్తుల్లో సైన్యానికి సపోర్ట్‌గా కనిపించేవారు. 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ది ఈ విషయంలో మరో తరహా వైఖరి. తానొక నియంత అని చెప్పుకోవడానికి వీలుగా.. తనలాంటి జాకెట్లు మరెవరూ ధరించకూడదన్న ఉద్దేశంతో నిషేధాజ్ఞలు, ధరించిన వాళ్లకు శిక్షలు అమలు చేయించాడు. 

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రోన్‌.. ఎయిర్‌ఫోర్స్‌ హూడీ ద్వారా సాదాసీదాను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండడంతోనే.. జెలెన్‌స్కీని కాపీ కొడుతూ.. ఇలా సింప్లిసిటీ డ్రామాలు ఆడుతున్నాడంటూ సోషల్‌ మీడియాలో మాక్రోన్‌పై ట్రోలింగ్‌ నడుస్తోంది.

మరిన్ని వార్తలు