Sheryl Sandberg: మాజీ బాయ్‌ ఫ్రెండ్‌కోసమే మెటాకు షాక్‌?

2 Jun, 2022 12:57 IST|Sakshi

మెటాకు బైబై చెప్పిన  షెరిల్ శాండ్‌బర్గ్ 

ఒక శకం ముగిసింది: మార్క్ జుకర్‌బర్గ్ 

మార్క్‌ ప్రతీ క్షణం అండగా నిలిచారు, కొత్త అధ్యాయానికి ఇదే టైం: షెరిల్ శాండ్‌బర్గ్ 

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ మెటా సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ ఆకస్మిక నిష్క్రమణ టెక్‌ వర్గాల్లో సంచలనం రేపింది. సంస్థనుంచి వైదొలగుతున్నట్టు ఆకస్మికంగా ప్రకటించారు.  అయితే భవిష్యత్తును ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, ప్రధానంగా కుటుంబానికి,  సేవా కార్యక్రమాలకు తన సమయాన్ని కేటాయిస్తానని ఫేస్‌బుక్‌లో తెలిపారు. అలాగే ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో  డైరెక్టర్‌గా కొనసాగుతాని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ప్రతీ కష్టమైన, కీలకమైన సమయాల్లో  అండగా నిలిచారంటూ  మార్క్ జుకర్‌బర్గ్‌ను ప్రశంసించారు. 2008లో ఉద్యోగంలో చేరినప్పుడు, ఐదేళ్లపాటు పనిచేస్తా అనుకున్నాను. కానీ పద్నాలుగేళ్లు జర్నీ కొనసాగింది.  తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభిచేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.

మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ కోసమేనా? ఎవరీ బాబీ కోటిక్‌?
అయితే మార్క్ జుకర్‌బర్గ్  సన్నిహితురాలు, తొలినాళ్లలో  ఫేస్‌బుక్‌  వృద్ధిలో కీలక పాత్ర పోషించిన షెరిల్ శాండ్‌బర్గ్ 14 సంవత్సరాల తరువాత కంపెనీనీ వీడటం చాలామందికి ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో షెరిల్‌ నిర్ణయానికి మాజీ ప్రియుడు బాబీ కోటిక్‌ కారణమా అనే ఊహాగానాలు మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. శాండ్‌బెర్గ్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నప్పటికీ ఇటీవలికాలంలో వచ్చిన తీవ్ర ఆరోపణలు ఈ పరిణామానికి దారితీశాయని  విశ్లేషకులు  అభిప్రాయం. 

తన స్నేహితుడు, యాక్టివిజన్ బ్లిజార్డ్  ప్రస్తుత సీఈవో బాబీ కోటిక్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తిప్పి కొట్టేందుకు తన పలుకు బడిని ఉపయోగించి శాయశక్తులా కృషి చేశారంటూ ఇటీవల ఆరోపణలు చెలరేగాయి. ఈ మేరకు 2022 ఏప్రిల్‌లో, వాల్ స్ట్రీట్ జర్నల్  ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై అంతర్గత విచారణ చేపట్టినప్పటికీ, ఆరోపణలన్నింటినీ మెటా  బహిరంగంగానే ఖండించింది.


జేవియర్ ఒలివాన్ (ఫైల్‌ ఫోటో)

షెరిల్ శాండ్‌బర్గ్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
ఒక శకం ముగిసిందంటూ షెరిల్‌ రాజీనామాను సోషల్‌మీడియా వేదికగా ప్రకటించిన జుకర్‌బర్గ్ ప్రస్తుతం శాండ్‌బర్గ్ ప్లేస్‌లో ఇంకా ఎవరిని ప్లాన్ చేయలేదని   తొలుత పేర్కొన్నారు. కానీ ఆ తరువాత చీఫ్ గ్రోత్ ఆఫీసర్ జేవియర్ ఒలివాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రత్యేక ఫేస్‌బుక్ పోస్ట్‌లో  వెల్లడించారు.  

మరిన్ని వార్తలు