వైరల్‌: మెక్సికోలో కూలిన మెట్రో ఫ్లైఓవర్‌, 23 మంది మృతి 

5 May, 2021 07:58 IST|Sakshi

మెక్సికో సిటీ: మెక్సికో సిటీలో మెట్రోలైన్‌పై రైలు వెళుతుండగా ఎలివేటెడ్‌ కారిడార్‌ (పిల్లర్లపై నిర్మించిన మెట్రో మార్గం) కుప్పకూలిన దుర్ఘట నలో 23 మంది మరణించగా, మరో 70 మంది గాయపడ్డారు. మెట్రో మార్గం కుప్పకూలే సమయంలోనే ఓ కారు అక్కడ ఉండటంతో ఫ్లైఓవర్‌ దానిపై పడింది. కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.మొత్తం 49 మందిని ఆస్పత్రిలో చేర్చామని నగర మేయర్‌ క్లౌడియా షీన్బౌమ్‌ తెలిపారు. మరణించిన వారిలో పిల్లలు సైతం ఉన్నారని, ఇది చాలా దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. 

కొనసాగుతున్న సహాయకచర్యలు.. 
ప్రమాదం గురించి తెలియగానే వందలాది మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెక్సికోలో కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా ఆంక్షలు ఉన్నప్పటికీ, ప్రజలు భారీగా ప్రమాద స్థలానిక చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి కారణమైన బాధ్యులను గుర్తించి శిక్ష విధించాలంటూ మెక్సికో విదేశాంగ కార్యదర్శి మార్సెలో ఎబ్రార్డ్‌ డిమాండ్‌ చేశారు. అయితే ఆయన 2006 నుంచి 2012 వరకు మెక్సికో సిటీ మేయర్‌గా పని చేశారు.

ఆ సమయంలోనే ఈ మెట్రో రైల్‌ లైన్‌ నిర్మాణం జరిగింది. 2024లో దేశాధ్యక్ష పదవికి మెర్సెలో పోటీపడనున్న నేపథ్యంలో ఈ ఘటన ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే 2017లో రిక్టర్‌ స్కేలుపై 7.1 తీవ్రతతో ఓ భూకంపం సంభవించింది. అది ఈ మెట్రోమార్గాన్ని దెబ్బతీసిందనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. 


చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్‌ గేట్స్‌  

మరిన్ని వార్తలు