గడియారం చెప్పేవరకు తెలీదు ఆమెకు గుండెపోటు వచ్చిందని

6 Jul, 2021 18:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహిళను ప్రాణాపాయం నుంచి తప్పించిన యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌

వాషింగ్టన్‌: యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ వీరోచిత గాథలు కొనసాగతునే ఉన్నాయి. గతంలో ఓ మహిళను కిడ్నాపర్ల చెర నుంచి కాపాడటం.. మధ్యప్రదేశ్‌లో ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైనం చదివాం. తాజాగా ఓ మహిళను గుండెపోటు బారిన పడి చనిపోకుండా కాపాడింది యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌. ఆ వివరాలు.. మిచిగాన్‌కు చెందిన డయాన్ ఫీన్స్ట్రా అనే మహిళకు ఓ రోజు యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లో తన హృదయ స్పందనలు అసాధరణంగా నమోదవ్వడం గమనించింది. భర్తను పిలిచి దాన్ని చూపించింది. వెంటనే అతడు డయాన్‌ను ఆస్పత్రికి వెళ్లమని సూచించాడు. హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత డాక్టర్లు డయాన్‌కు ఈసీజీ నిర్వహించగా.. ఆమెకు కొన్ని రోజుల క్రితం గుండెపోటు వచ్చిందని.. కానీ దాని గురించి డయాన్‌కు తెలియలేదని గుర్తించారు.

ఈ క్రమంలో డయాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌ 22న నా గుండె నిమిషానికి 169 సార్లు కొట్టుకుంది. కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు, కనీసం మెట్లు ఎక్కినప్పుడు కూడా గుండె ఇంత వెగంగా కొట్టుకోలేదు. అందుకే నా భర్తను పిలిచి.. తనకు ఇది చూపించి.. ఏమైనా సీరియసా అని అడిగాను. ఆయన నన్ను ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. వాచ్‌ రికార్డైన హృదయస్పందనలు పరిశీలించి.. ఈసీజీ నిర్వహించారు. గతంలో నాకు గుండెపోటు వచ్చింది.. కానీ దాని గురించి నాకు తెలయలేదని తెలిపారు. ఇక పురుషులతో పోల్చుకుంటే.. మహిళల్లో గుండెపోటు సందర్భంగా కనిపించే లక్షణాలు చాలా వేరుగా ఉంటాయి’’ అని డయాన్‌ తెలిపారు.

‘‘ఇక వయసు పెరుగుతున్న కొద్ది నా ఎడమ చేతిలో నొప్పి.. ఎడమ పాదంలో వాపు వంటి లక్షణాలను నేను గమనించాను. అయితే గ్యాస్‌ సమస్య వల్ల ఇలా అనిపిస్తుందనుకున్నాను. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే నా భుజంలో నొప్పి వచ్చేది. కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాను’’ అని తెలిపారు డయాన్‌. ఈసీజీ రిపోర్టు తర్వాత మరిన్ని టెస్టులు చేసి.. డయాన్‌కు స్టెంట్‌ వేయడం అవసరం అని తెలిపారు వైద్యులు. ఆ తర్వాత ఆపరేషన్‌ చేసి.. స్టెంట్‌ వేశారు. ఈ క్రమంలో డయాన్‌.. జనాలు ఎప్పటికప్పుడు తమ హృదయ స్పందనలు చెక్‌ చేసుకుంటే.. గుండెపోటు బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు