సముద్రాల గుండె చప్పుడు విందాం!

20 Oct, 2022 04:21 IST|Sakshi

ఐరిష్‌ కళాకారిణి మెక్‌డొనాల్డ్‌ వినూత్న ప్రయోగం 

సముద్ర గర్భంలోని శబ్దాలు మైక్రోఫోన్ల సాయంతో రికార్డు

భవిష్యత్తు విపరిణామాలను ముందే తెలుసుకొనే అవకాశం  

వాషింగ్టన్‌: వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో ముంపు భయం వెంటాడుతోంది. వీటన్నింటికి మానవుల అత్యాశే కారణమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో సముద్రాల గుండె ఘోష వినేందుకు ఐర్లాండ్‌కు చెందిన కళాకారిణి సియోభాన్‌ మెక్‌డొనాల్డ్‌ నడుం బిగించారు. సముద్రాల అడుగు భాగంలో సంభవించే భూకంపాలు, విరిగిపడే కొండ చరియలు, జీవజాలం మనుగడ, కాలుష్యం, కరిగిపోతున్న మంచు గురించి సమగ్రంగా తెలుసుకొనేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సముద్రం వివిధ ప్రాంతాల్లో మైక్రోఫోన్లు(హైడ్రోఫోన్స్‌) జార విడుస్తున్నారు. ఇందుకోసం  గ్రీన్‌ల్యాండ్, కెనడా మధ్య ఉన్న డెవిస్‌ అఖాతాన్ని ఎంచుకున్నారు. ఇప్పటిదాకా 12 మైక్రోఫోన్లను జారవిడిచారు. ఈ ప్రయోగానికి అమెరికా నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ సహకారం అందిస్తోంది.  

ఈ ప్రయోగం ఒక టైమ్‌ క్యాప్సూల్‌  
మైక్రోఫోన్లు రెండేళ్లపాటు సముద్రంలోనే ఉంటాయి. 2024లో బయటకు తీస్తారు. ఇవి ప్రతి గంటకోసారి సముద్ర అడుగు భాగంలోని శబ్దాలను స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ శబ్దాలన్నింటిని కలిపి ఒక ఆడియోను రూపొందిస్తారు. ఇది ‘సముద్ర జ్ఞాపకం’గా మెక్‌డొనాల్డ్‌ అభివర్ణించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ విపత్తుల విషయంలో ఇదే మొట్టమొదటి సైన్స్, ఆర్ట్స్‌ ఉమ్మడి ప్రయోగమని చెబుతున్నారు.

సముద్రాల గుండె చప్పుడు వినడం ద్వారా భూమిపై సమీప భవష్యత్తులో సంభవించే విపరిణామాలను ముందే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రయోగం ఒక టైమ్‌ క్యాప్సూల్‌ లాంటిదేనని మెక్‌డొనాల్డ్‌ అన్నారు. పెరిగిపోతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ తనను ఈ ప్రయత్నానికి పురికొల్పిందని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌లో పెద్ద ఎత్తున మంచు పేరుకొని ఉంది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకం ఆపేసినా సరే గ్రీన్‌ల్యాండ్‌లో 110 క్వాడ్రిలియన్‌ టన్నుల మంచు కరిగిపోయి సముద్ర మట్టం 27 సెంటీమీటర్లు(10.6 అంగుళాలు) పెరుగుతుందని అంచనా.   
 

మరిన్ని వార్తలు