భారత్‌ పార్లమెంట్‌లో మైకుల మూగనోము

7 Mar, 2023 04:17 IST|Sakshi

బ్రిటిష్‌ ఎంపీలతో రాహుల్‌ గాంధీ

లండన్‌:  భారత పార్లమెంట్‌ దిగువ సభ అయిన లోక్‌సభలో మైక్రోఫోన్లు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తరచుగా మూగబోతుంటాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ సోమవారం లండన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రిటిష్‌ ఎంపీలను ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడారు. తాను నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర గురించి ప్రస్తావించారు. ప్రజలను కూడగట్టడానికి ఇదొక రాజకీయ కార్యాచరణగా ఉపయోగపడిందని అన్నారు.

భారత లోక్‌సభలో మైకులు పని చేస్తుంటాయి గానీ తరచుగా మొరాయిస్తుంటాయని వ్యా ఖ్యానించారు. మాట్లాడేటప్పుడు మధ్యలోనే ఆగిపోతుంటాయని, తనకు చాలాసార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ గురించి పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. చైనా సైన్యంలో భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిందని, దానిపైనా ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదన్నారు. పార్లమెంట్‌లో గతంలో జరిగిన అర్థవంతమైన చర్చలు, సంవాదాలు ఇప్పుడు లేకుండాపోయాయని ఆక్షేపించారు.

మరిన్ని వార్తలు