Microplastics In Human Lungs: మనుషుల ఊపిరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్‌

8 Apr, 2022 05:57 IST|Sakshi

గుర్తించిన హల్‌యార్క్‌ మెడికల్‌ స్కూల్‌ సైంటిస్టులు

లండన్‌: భూగోళాన్ని ముంచెత్తుతున్న ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ భూతం ఇప్పుడు మనుషుల శరీరంలోకి సైతం చొరబడుతోంది. మనుషుల ఉపరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులను ఇంగ్లాండ్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ హల్‌కు చెందిన హల్‌యార్క్‌ మెడికల్‌ స్కూల్‌ సైంటిస్టులు గుర్తించారు. గాలితోపాటు ప్రాణాంతక ప్లాస్టిక్‌ రేణువులను సైతం మనం పీలుస్తున్నామని వారు చెప్పారు. ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్‌ తిష్ట వేస్తే శ్వాస వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. సముద్రాలు, కొండలు, భూమి అనే తేడా లేదు.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది.

వ్యర్థాల్లోకి చేరిన పెద్ద ప్లాస్టిక్‌ వస్తువులు చిన్నచిన్న ముక్కలుగా విడిపోతున్నాయి. 5 మిల్లీమీటర్ల పరిమాణంలోకీ మారుతున్నాయి. కంటికి కనిపించని సూక్ష్మమైన ఈ ప్లాస్టిక్‌ రేణువులను వాటర్‌ ఫిల్టర్లు కూడా అడ్డుకోలేవు. చివరకు ఇవి పీల్చే గాలి, తాగే నీటి ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. 13 లంగ్‌ టిష్యూ నమూనాలను పరీక్షించగా, 11 నమూనాల్లో 39 మైక్రో ప్లాస్టిక్‌ రేణువులు కనిపించాయని çపరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనం ఫలితాలను టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌ జర్నల్‌ సైన్స్‌లో ప్రచురించనున్నారు. జీవించి ఉన్న మనుషుల ఇతర శరీర భాగాల్లో ప్లాస్టిక్‌ ఆనవాళ్లను గతంలోనే గుర్తించినప్పటికీ.. ఊపిరితిత్తుల అంతర్భాగాల్లో గుర్తించడం మాత్రం ఇదే మొదటిసారి అని సైంటిస్టులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయని, అందులోకి ప్లాస్టిక్‌ రేణువులు చేరితే శ్వాసలో సమస్యలు వస్తాయన్నారు.

మరిన్ని వార్తలు