కోవిడ్‌ గురించి 2015లోనే హెచ్చరించిన బిల్‌ గేట్స్‌

8 Feb, 2021 01:12 IST|Sakshi

రెండు ప్రమాదాల గురించి మాట్లాడిన వ్యాపార దిగ్గజం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కి వ్యతిరేకంగా వివిధ దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియని ప్రారంభించిన తరుణంలో, అమెరికా వ్యాపార దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ 2015లోనే రాబోయే మహమ్మారి గురించి హెచ్చరించిన విషయం చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఏ మహమ్మారి తలుపుతట్టనుందో అనే విషయాన్ని బిల్‌ గేట్స్‌ ఇప్పుడు అంచనా వేస్తున్నారు.  ‘‘నెక్టŠస్‌ ఔట్‌ బ్రేక్‌? వుయ్‌ ఆర్‌ నాట్‌ రెడీ’’ (తదుపరి ప్రమాదానికి మేం సిద్ధంగా లేము) అనే పేరుతో 2015లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో బిల్‌ గేట్స్‌ కోవిడ్‌–19 లాంటి మహమ్మారి ప్రమాదం పొంచివుందని చెప్పారు. ప్రపంచం రాబోయే అంటువ్యాధి మహమ్మారిలను తట్టుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆనాడే గేట్స్‌ జోస్యం చెప్పినట్టు చెప్పారు. రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఏదైనా కోటి మందిని చంపగలిగేది ఉందీ అంటే అది ఏ యుద్ధమో కాదు, కేవలం వైరస్‌ మాత్రమేనని బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించారు. ‘‘మిస్సైల్స్‌ కాదు మైక్రాన్స్‌ (సూక్ష్మజీవులు)అని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్థంభింపజేసిన తరుణంలో 2020మార్చిలో, బిల్‌గేట్స్‌ ఎప్పుడో 2015లో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో వైరల్‌ అయ్యింది.

జోస్యం గురించి తెలియదు..
మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఇటీవల ప్రముఖ యూట్యూబ్‌ ఛానల్‌ ‘‘వెరిటాసియం’’ను నిర్వహిస్తోన్న డెరెక్‌ ముల్లర్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. తనకు జోస్యం గురించి అంతగా తెలియదని, ఇలాంటి వాటిలో తనకేం అనుభవం లేదని గేట్స్, ముల్లర్‌తో అన్నారు. అర్థ దశాబ్దం క్రితమే ఇలాంటిదొక విపత్తు ముంచుకొస్తుందని అంత నిర్దిష్టంగా ఎలా చెప్పగలిగారని ముల్లర్‌ బిల్‌ గేట్స్‌ని ప్రశ్నించారు. అనేక శ్వాసకోశ సంబంధ వైరస్‌లు ఉన్నాయని, ఆయా సమయాన్ని బట్టి ఒక్కోటి పుట్టుకొస్తుందని ఆయన సమాధానమిచ్చారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అత్యంత భయంకరమైనవి. ఎందుకంటే మీకు ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పటికీ, ఇంకా మీరు విమానాల్లోనూ, బస్సుల్లోనూ తిరుగుతూ ఉంటారు. ఎబోలా లాంటి ఇతర వ్యాధులొస్తే మీరు ఆసుపత్రుల్లో ఉంటారు. కానీ అలా కాకుండా ఇప్పుడు బయట తిరిగేస్తుంటారని గేట్స్‌ చెప్పారు. ప్రజలు సిద్ధంగా లేని తదుపరి విపత్తులను గురించి చెప్పాలంటూ ముల్లర్‌ కోరారు. ఈ ప్రశ్నకు ప్రజలు సంసిద్ధంగా లేని తదుపరి విపత్తు ఒకటి వాతావరణం మార్పు, మరొకటి బయోటెర్రరిజం అని గేట్స్‌ చెప్పారు.

మరిన్ని అంటువ్యాధులు..
ఈ కోవిడ్‌ మహమ్మారి కారణంగా మరణించిన వారికంటే ప్రతి యేడాది మరణాల రేటు అధికం అవుతుందన్నారు. మరో సంక్షోభం గురించి ప్రజలు మాట్లాడటానికి కూడా ఇష్టపడరని తాను భావిస్తున్నట్టు ఆయన అన్నారు. బయోటెర్రరిజం గురించి మాట్లాడుతూ ఎవరైనా నష్టం కలిగించాలని భావించేవారు, హానికారకమైన వైరస్‌ని సృష్టించొచ్చని, దీనిలాగే అది కూడా సహజసిద్ధమైన వైరస్‌కన్నా అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని బిల్‌ గేట్స్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి అత్యంత విపత్కరమైన కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో, రాబోయే అంటువ్యాధులను ప్రజలు అడ్డుకోగలరా? అని ముల్లర్‌ ప్రశ్నించగా, గేట్స్‌ లేదు అని సమాధానమిచ్చారు. రాబోయే కాలంలో మరిన్ని అంటువ్యాధులు వచ్చే ప్రమాదం పొంచివుందని గేట్స్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు