భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు

27 Oct, 2020 02:34 IST|Sakshi

చైనాకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా చర్చలు  

సాధారణంగా రెండు ప్లస్‌ రెండు నాలుగవుతుంది. కానీ ఇండో అమెరికా మాత్రం రెండు ప్లస్‌ రెండు ఈక్వల్‌టూ ఒకటి అంటున్నాయి. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య జరిగే ఈ చర్చలు..ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించేందుకు, దక్షిణాసియాలో ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సాగుతున్నాయి. పలు దేశాల పర్యటనలను వర్చువల్‌ పర్యటనలుగా మార్చుకున్న అమెరికా రక్షణ మంత్రి.. భారత్‌ పర్యటనకు స్వయంగా రావడం గమనిస్తే ప్రాధాన్యం అర్థమవుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.   

మంగళవారం భారత్, అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ సోమవారం భారత్‌ వచ్చారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, చైనాకు చెక్‌ పెట్టడం ముఖ్య ఉద్దేశంగా 2+2 చర్చలు జరగనున్నాయి. కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నా అమెరికా కీలక మంత్రులు ఈ పర్యటనకు స్వయంగా రావడం విశేషం.  జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌తో సైతం అమెరికా మంత్రులు సమావేశం కానున్నారు.  ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్‌ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోంది.  

భారత్‌ నిర్ణయాత్మకం
దక్షిణాసియా ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోనే భారత్‌ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోందని అమెరికా ప్రశంసించింది. భారత్‌ ఎదుగుదలను స్వాగతిస్తున్నట్లు యూఎస్‌ రక్షణ, విదేశాంగ శాఖలు తెలిపాయి. 2021 జనవరి నుంచి ఆరంభమయ్యే ఐరాస భద్రతా మండలి టర్మ్‌లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపాయి. 2017లో ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియాలు ఇండో పసిఫిక్‌ జలాలను స్వేచ్ఛగా ఉంచేందుకు ఉమ్మడిగా వ్యూహరచన చేయాలని భావించాయి. ఇందుకోసం నాలుగు దేశాలు కలిసి క్వాడ్‌ పేరిట ఒక బృందంగా ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ 4 దేశాల మంత్రులు జపాన్‌లో సమావేశమయ్యారు. చైనా దుందుడుకు చేష్టలను ఆపేందుకు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. ఎకానమీ పరంగానూ భారత్‌ అత్యంత కీలకమని అమెరికా భావిస్తోంది. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ 20 బిలియన్‌ డాలర్లకుపైనే ఉంది.

2+2 చర్చలు, బెకా అంటే..
ఒక దేశ రక్షణ, విదేశీ మంత్రులు మరో దేశ రక్షణ, విదేశీ మంత్రులతో జరిపే చర్చలను టు ప్లస్‌ టు చర్చలంటారు. ఒక దేశం తనకు అత్యంత కీలకమని భావించే మరో దేశంతో ఇలాంటి సమావేశాలు జరుపుతుంది.  రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ చర్చలు కీలకంగా ఉంటాయి. తాజా సమావేశాల్లో భారత్‌ బెకా(బేసిక్‌ ఎక్సే్చంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌) కోసం ఎదురుచూస్తోంది. శాటిలైట్‌ సమాచార మార్పిడి ఈ బెకాలో కీలకం. ఈ ఒప్పందం కుదిరితే యూఎస్‌ జియో శాటిలైట్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని ఇండియా వాడుకునే వీలుంటుంది. 2002లో అమెరికాతో భారత్‌ జిఎస్‌ఓఎంఐఏ(జనరల్‌ సెక్యూరిటీ ఆఫ్‌ మిలటరీ ఇన్ఫర్మేషన్‌ అగ్రిమెంట్‌) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా లాజిస్టికల్‌ ఎక్సే్చంజ్‌ మెమొరాండమ్‌ అగ్రిమెంట్‌(లెమొవా)ను 2016లో, కమ్యూనికేషన్, కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్‌(కామ్‌కాసా)ను 2018లో పూర్తి చేసుకుంది. బెకా పూర్తయితే 2002 అగ్రిమెంట్‌ దశలన్నీ పూర్తయినట్లవుతుంది.   

మరిన్ని వార్తలు